
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనేందుకు జిల్లాకు బుధవారం వచ్చిన ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు. బీసీల పరిస్థితిని అంచనా వేసేందుకు ఓ అధ్యయన కమిటీ వేశారనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు, కులాలు స్థితిగతులు, జీవన ప్రమాణాలు తదితర అంశాలపై ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు నాడు వైఎస్ హయాంలోనే న్యాయం జరిగిందనీ, మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీ సామాజిక వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుందే తప్ప వారికి ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు బీసీలకోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని మండిపడ్డారు. ఇస్త్రీ పెట్టెలు, సైకిళ్లు అంటూ తాత్కాలిక ప్రయోజనాలే తప్ప బీసీ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శాశ్వత పథకాలు అమలు చేయలేదని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే బీసీ సామాజిక వర్గాలకు విద్య, వైద్యం, రాజకీయంగా అన్ని రంగాల్లోను ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు చేపడతారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment