ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపితే సహించేది లేదని ఉప రవాణాశాఖ కమిషనర్ (డీటీసీ) డాక్టర్ వి.సుందర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు ఆర్టీవో పరిధిలోని అదనపు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు(ఏఎంవీఐలు) గుంటూరులో మూడు బృందాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు, కార్ల తనిఖీ నిర్వహించారు. దృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లెసైన్స్ లేని 40కిపైగా వాహనాలను ఆర్టీసీ బస్టాండ్‌కు, రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు. కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుతాయని చెప్పారు. వేసవి సెలవుల్లో మైనర్లకు వాహనాలు ఇస్తున్నారని, లెసైన్స్ లేకుండా తనిఖీల్లో పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానా విధించడంతోపాటు రెండు రోజులు వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధ పడేకంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు.