రాష్ట్రంలో మహిళ, గిరిజన పోలీస్‌ బెటాలియన్లు  | Woman and Tribal Police Battalions In The State | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళ, గిరిజన పోలీస్‌ బెటాలియన్లు 

Published Mon, Jun 17 2019 4:26 AM | Last Updated on Mon, Jun 17 2019 4:26 AM

Woman and Tribal Police Battalions In The State - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మహిళ, గిరిజన పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కానిస్టేబుల్స్‌ మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాలుగు ఏపీఎస్‌పీ బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం మొదటగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దళిత మహిళనైన తనకు కీలక బాధ్యత గల హోం మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ రూపొందిస్తాం 
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా చేస్తామన్నారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీఆఫ్‌ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 2018 పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని, ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. 

చాంబర్‌లో ప్రత్యేక పూజలు.. 
తొలుత మంత్రి సుచరిత, ఆమె భర్త దయాసాగర్‌తో కలసి చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఎస్పీ గజరావు భూపాల్, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. 

ఫోన్‌కాల్‌ ఫిర్యాదుతో  పాస్టర్‌ అరెస్టు 
తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్‌ చేసి నాలుగు నెలల కిందట జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి సుచరిత వివరించారు. ఓ చిన్నారి పట్ల ఫాస్టర్‌ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె తెలిపిందన్నారు. ఆ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి ఫాస్టర్‌ పారిపోయారని, అయితే ఓ వర్గం మీడియా మాత్రం.. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ పాస్టర్‌ని పట్టుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారని మంత్రి తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, తొందరపడి వార్తలు రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement