ఆరని ఇథనాల్‌ చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరని ఇథనాల్‌ చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి

Published Wed, Oct 25 2023 1:08 AM | Last Updated on Wed, Oct 25 2023 9:25 AM

- - Sakshi

నిర్మానుష్యంగా మారిన చిత్తనూర్‌

నారాయణ్‌పేట్‌: కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా.. ఇథనాల్‌ కంపెనీ ఆయా గ్రామాల్లో చిచ్చు పెట్టింది. ఆదివారం జరిగిన ఘటనతో చిత్తనూర్‌, ఎక్లాస్‌పూర్‌, జిన్నారం గ్రామాల్లో సోమవారం దసరా పండుగ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఆయా గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి అడవులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు.

ఎక్లాస్‌పూర్‌ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దగ్గర కంపెనీ నుంచి వ్యర్థాలతో వచ్చిన ఓ ట్యాంకర్‌ను అడ్డుకొని ధర్నా చేస్తున్న మూడు గ్రామాల ప్రజలు, పోలీసులకు నడుమ జరిగిన ఘర్షణలో 10 మంది గ్రామస్తులు, ఏడుగురు మంది పోలీసులు గాయపడ్డారు. సెల్‌ఫోన్లలో తీసిన వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి గాలింపు ప్రారంభించారు.

ఇళ్లల్లో ఉన్న వారిని పోలీసు వాహనాల్లో ఇతర మండలాల పోలీస్‌స్టేషన్లకు తరలించి విచారిస్తున్నారు. మరింత మంది కోసం ప్రత్యేక పోలీసులు గాలింపు ప్రారంభించారు. చిత్తనూర్‌, ఎక్లాస్‌పూర్‌ సర్పంచులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

భయాందోళనలో గ్రామస్తులు..
రాత్రిళ్లు స్పెషల్‌ బెటాలియన్‌ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండటంతో చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్‌పూర్‌ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు గ్రామాలు వదిలి వెళ్లడంతో ఇళ్ల దగ్గర ఉన్న వృద్ధులు, చిన్నారులు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. జన సంచారం లేక ఆయా గ్రామస్తులు నిర్మానుష్యంగా మారాయి.

ఇళ్లకు తాళాలు..
పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వారి కోసం పోలీసులు రెండ్రోజులుగా ఇల్లిల్లూ జల్లెడ పడుతుండటంతో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కొందరు, వ్యవసాయ పొలాలకు మరికొందరు తరలివెళ్లారు. ఇళ్ల వద్ద కేవలం వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. పండుగ కోసం గ్రామాలకు వచ్చిన బంధువులను సైతం రాత్రిళ్లు పోలీసులు చితకబాదినట్లు వివరించారు.

ఐజీ, డీఐజీ ఆరా..
ఘర్షణ వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఐజీ షానవాజ్‌ ఖాసీం, డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహన్‌, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మరికల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఎన్నికల్‌ కోడ్‌ అమలులో ఉన్నందుకు బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలను చర్చించినట్లు తెలిసింది.

పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి
చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీని మూసివేయాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్‌ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కంపెనీ నుంచి వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్‌ వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలన్నారు.

ఇథనాల్‌ కంపెనీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కంపెనీ వ్యర్థాలను సమీపంలోని మన్నె వాగులో వేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని.. మూగజీవాలు, మానవళికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించి బాధిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నర్సన్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, వేణు ఉన్నారు.

గ్రామస్తులపై దాడిని ఖండిస్తున్నాం..
రెండేళ్ల నుంచి కంపెనీ రద్దు కోసం ఉద్యమిస్తున్న గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వీరన్న, కృష్ణయ్య పాల్గొన్నారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి..
మూడు గ్రామాల ప్రజలపై పోలీసుల లాఠీచార్జ్‌ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమన్నారు. బాల్‌రాం, గోపాల్‌, సుదర్శన్‌, మల్లయ్య ఉన్నారు.

కేసులు ఎత్తి వేయాలి..
గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్‌ హేయమైన చర్యగా భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలను కూడా చూడకుండా పోలీసులు దాడి చేసి ఆ ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చారని, ఇందుకు వారే బాధ్యత వహించాలన్నారు. గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నారాయణ, కాళేశ్వర్‌ ఉన్నారు.

20 మందిపై కేసులు నమోదు..
పోలీసులపై దాడి ఘటనలో మూడు గ్రామాల్లోని 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. వీరిని నారాయణపేట కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.

అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి..
చిత్తనూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఘర్షణలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మంగళవారం టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ను కలిసి విన్నవించారు. జూరాల ఆగ్రో ఇథనాల్‌ కంపెనీతో నీటి, వాయు కాలుష్యం ఏర్పడి సుమారు 26 గ్రామాలకు నష్టం వాటిల్లుతోందన్నారు.

రెండేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు కంపెనీని తరలించాలంటూ పోరాడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రజల విజ్ఞప్తులను వినిపించుకోకుండా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారని.. వ్యతిరేకిస్తున్న ప్రజలను కాపాడాలని కోరారు. నిజమైన దోషులను గుర్తించి మిగతా వారిని విడుదల చేయాలని కాంగ్రెస్‌పార్టీ తరఫున కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement