నల్లమలలోని టైగర్ సఫారీ వాహనం
రాష్ట్రంలో టూరిస్ట్ డెస్టినేషన్‌గా నల్లమల అడవులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పర్యాటకులకు ప్రత్యేకంగా ‘టైగర్ స్టే’ ప్యాకేజీలు
దట్టమైన అడవిలో ట్రెక్కింగ్, సఫారీ, వసతితో రోజంతా అడవిని ఆస్వాదించే వీలు
వీకెండ్, సెలవు రోజుల్లో కృష్ణాతీరంలోని సోమశిలకు పెరుగుతున్న రద్దీ
అడవి అందాలు, కృష్ణమ్మ సోయగాలను ఏకకాలంలో వీక్షించేలా అటవీ శాఖ ప్రణాళిక
సాక్షి, నాగర్‌కర్నూల్: పచ్చని నల్లమల కొండల నుంచి నీలం రంగులో ప్రవహించే కృష్ణానది పరవళ్లు చూపరులను మంత్రముగ్దులను చేస్తాయి. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లోని కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణాతీరంలోని సోమశిల ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వీకెండ్ రోజుల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి.
హైదరాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, స్టూడెంట్స్, ఫ్రెండ్స్ గ్రూపులుగా ఏర్పడి ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోమశిలకు వస్తున్న పర్యాటకుల సౌకర్యం కోసం ప్రభుత్వం కృష్ణానది తీరంలో కాటేజీలను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ కాటేజీల్లో వసతి, భోజనం, స్విమ్మింగ్ పూల్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు సోమశిల గ్రామంలో పదుల సంఖ్యలో ప్రైవేటు రిసార్ట్‌లు, కాటేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం శని, ఆదివారాల్లో ఇవన్నీ పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కృష్ణానదిలో విహరించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి 200 కి.మీ. దూరంలో సోమశిల ఉంది.
అటవీశాఖ ఆధ్వర్యంలో సోమశిల సమీపంలో ఎకో పార్కును నిర్మించగా, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. నల్లమల అడవి, సఫారీ, కృష్ణాతీరంలోని అందాలను ఒకేసారి ఆస్వాదించేలా సరికొత్త ఎకోటూరిజం టూర్ ప్లాన్‌ను అటవీశాఖ రూపొందించింది. త్వరలోనే ఈ తరహా టూర్ ప్లాన్‌ను అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లమలలో టైగర్ స్టే ప్యాకేజీ..
నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. అడవిలోని పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసేందుకు టైగర్ సఫారీ అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల సంతానోత్పత్తికి అనుకూలం కావడంతో ఈ మూడు నెలల పాటు సఫారీ నిలిపివేస్తారు.
మిగతా రోజుల్లో నిత్యం టైగర్ సఫారీ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి నల్లమలలో టైగర్ సఫారీని అధికారులు పునప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులు, అడవిలో ఒకరోజు పాటు పూర్తిగా గడపాలనుకునేవారికి అటవీశాఖ ‘టైగర్ స్టే ప్యాకేజీ’ని అందుబాటులోకి తెచ్చింది.
ఉదయం పూట అడవిలో పక్షుల సందడి, వాటి కిలకిలరావాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్, టైగర్ సఫారీ, వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. దట్టమైన అడవిలో సుమారు 20 కి.మీ. దూరం టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించవచ్చు.
నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో టైగర్ సఫారీ కోసం హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ ఫర్హాబాద్ వ్యూపాయింట్ వద్దకు చేరుకోవచ్చు. వీకెండ్ సమయాల్లో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులతో టైగర్ సఫారీకి రద్దీ పెరుగుతోంది. ఇదే దారిలో వటవర్లపల్లి సమీపంలో మల్లెలతీర్థం జలపాతం, ఆక్టోపస్ వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. టైగర్ స్టే ప్యాకేజీ వివరాల కోసం "amrabadtigerreserve.com'లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment