![ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nrpt301-210086_mr-1738869782-0.jpg.webp?itok=fuhEqnW2)
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
మరికల్: కృష్ణా జలాల కేటాయింపులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు. మరికల్‌లో గురువారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే పాలకులు లేకపోవడం వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయించిన కృష్ణా జలాల విషయంలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏదుల నుంచి డిండికి నీటిని ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 11ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఎత్తయిన షాద్‌నగర్ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా కాల్వలు తీసి అక్కడ 30 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మిస్తే పాత పాలమూరు జిల్లా అంతటా 35 లక్షల ఎకరాలకు సాగునీరు పారే అవకాశం ఉందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన 90 టీఎంసీలను ఫేజ్–1, ఫేజ్–2గా విభజించి 45 టీఎంసీల నీటిని నారాయణపేట కొడంగల్ ప్రాంతానికి కేటాయిస్తే ఈ ప్రాంతంలో వలసలు పూర్తిగా నివారించవచ్చన్నారు. ఇందుకోసం ఈ ప్రాంత ప్రజలు, నాయకులు లేఖల ద్వారా నిరంతరం ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేయాలని సూచించారు. అలాగే కోయిల్‌సాగర్, భీమాఫేజ్–1కు పూర్తి స్థాయి నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో కోయిల్‌సాగర్ చివరి ఆయకట్టు వరకు ధ్వంసమైన పాత కాల్వలను, తూములను మరమ్మతులు చేయాలన్నారు. పాలమూరు నీటి పంపకాల విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కూడా వినతి పత్రాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కో కన్వీనర్ సుదర్షన్ టీఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్, చైతన్యా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, సూర్యప్రకాష్, గోపి, వీరన్న, రాజు, రాములు, హరీష్, విష్ణు, అయ్యప్ప, లక్ష్మయ్య తధితరులు పాల్గొన్నారు.
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్
రాఘవచారి
Comments
Please login to add a commentAdd a comment