సన్నాలకే రైతుల మొగ్గు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో యాసంగి సీజన్‌లో సన్న రకాల వరి సాగుకే రైతులు మొగ్గు చూపారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఈ యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో సన్నరకం వరిని సాగు చేశారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో గత సంవత్సరానికి భిన్నంగా ఎక్కువ మొత్తంలో ఈ పంటను వేశారు. మొత్తానికి ఈ యాసంగిలో 1.3 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద వరిపంట సాగు చేశారు. ఇందులో దాదాపు 87,500 ఎకరాల వరకు సన్న రకాలను సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గత సంవత్సరం కంటే ఈ యాసంగిలో 25 శాతం రైతులు సన్న రకాలకు మొగ్గు చూపినట్లు వ్యవసాయశాఖ సర్వేలో తేలింది. సన్న రకాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉండటం, ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడంతో పాటు జిల్లాలోని స్థానిక మిల్లర్లతో పాటు ఇతర రాష్ట్రాల మిల్లర్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుండటం వల్ల సన్న రకాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దిగుబడి కూడా వస్తుండటంతో బీపీటీ, గంగా కావేరి, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ, సోనా మసూరి, సాంబ మసూరితో పాటు ఇతర సన్న రకాలను వేశారు. దీంతో కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా మండలాల వారీగా సాగు చేసిన పంటల వివరాలను సర్వే చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఆరుతడి పంటలను తగ్గిస్తున్న రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగును చేశారు. సమయం దాటిపోతున్న ఇంకా కొన్నిచోట్ల వరినాట్లను కొనసాగిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సన్న రకాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. వరితో పాటు వేరుశనగ 12,832, మొక్కజొన్న 2,800 ఎకరాల్లో సాగు చేశారని, జొన్న, ఆముదం, మినుము పంటలు కూడా అక్కడక్కడ వేశారని చెప్పారు.
జిల్లాలో 1.3 లక్షల ఎకరాల్లో
వరిపంట సాగు
ఇందులో 87,500 ఎకరాలు సన్నరకమే..
Comments
Please login to add a commentAdd a comment