రామాయంపేట, న్యూస్‌లైన్: గుర్తుతెలియని ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఈ సంఘటన రామాయంపేట పట్టణ శివారులో మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం...గుర్తుతెలియని ఓ మహిళ(35) మృతదేహాన్ని పట్టణ శివారులోని మల్లన్న గుట్ట వద్ద ఓ వెంచర్ మైదానంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన సీఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులను రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగి లాలు మహిళ మృతదేహం వద్ద నుంచి మల్లన్నగుట్ట, పెద్దమ్మ దేవాలయం గుట్ట చుట్టూ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాయి.
దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన సీఐ, గుర్తుతెలియని మహిళ మెడకు దుండగులు ప్లాస్టిక్ తాడు బిగించి ఉరివేశారని, అనంతరం సుమారు 50 కిలోల రాయితో తలపై బాదారని తెలిపారు. అందువల్లే మహిళ తల నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేని విధంగా తయారైందన్నారు. మృతురాలి ఒంటిపై పూలరంగు చీర, కుడి చేతిపై పచ్చబొట్టు పొడిచి ఉందన్నారు. ఎవరికైనా ఈ మహిళ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.