
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మహిళలు
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పొదుపు సంఘంలో దాచుకున్న డబ్బులను కాజేసి ఉడాయించిన ఆర్పీ నుంచి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలంటూ సోమవారం మహిళలు రోడ్డెక్కారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట చిత్తూరు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నీరుగట్టువారిపల్లెలో శ్రీకనకదుర్గ ఏఎల్‌ఎఫ్ ఆర్పీగా అరుణ పనిచేసేదన్నారు.
ఆమె ఆధ్వర్యంలో 30 గ్రూపుల్లో సుమారు 300మందికి పైగా మహిళలు డబ్బులు పొదుపుచేయడం, రుణాలు తీసుకోవడం తదితర మెప్మా కార్యక్రమాలు నిర్వహించేవాళ్లమని చెప్పారు. ఈ క్రమంలో ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇంటికి తాళం వేసిన అరుణ ఎటో వెళ్లిపోయిందన్నారు. వారం రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లామన్నారు. మెప్మా అధికారులు విచా రణ జరిపి ఎంతమొత్తంలో అరుణ పొదుపు సంఘం డబ్బులు అవకతవకలకు పాల్పడిందో నివేదిక ఇస్తే కేసు తీసుకుంటామని పోలీసులు చెప్పారన్నారు.
దీంతో అప్పటి కమిషనర్ భవానీప్రసాద్, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, మెప్మా అధికారి అబ్బాస్ సమక్షంలో ఆమె ఇంటి తాళాలు తీసి గ్రూపులకు సంబంధించిన పాసుపుస్తకాలు, అకౌంట్స్ బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 గ్రూపులకు సంబం ధించి రూ.45,60,271 స్వాహా చేసినట్లు తేల్చడం జరిగిందన్నారు. పొదుపు సంఘం డబ్బులు కాజేసి ఊరువదిలిపోయిన ఆర్పీ అరుణ హైదరాబాద్ ఉన్న ట్లు తెలుసుకుని, ఆమెను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తే.. మూడురోజులుగా ఇటు పోలీసులు, అటు మెప్మా అధికారులు న్యాయం చేయడం లేదన్నారు.
దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. «మహిళల ధర్నా కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో వన్‌టౌన్ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్‌ఐ సోమశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో సంప్రదింపులు జరిపారు. సమస్యను మెప్మా అధికారుల సమక్షంలో పరిష్కరిస్తామని ధర్నాను విరమింపజేశారు. మెప్మా కార్యాలయంలో బాధిత మహిళలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, వారి వినతి మేరకు ఆర్పీ అరుణపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.