అసలేమైంది..?
Published Thu, Dec 5 2013 3:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ‘కాపాడండి.. రక్షించండి.. నన్ను విడిచిపెట్టండి.. అమ్మా...’ అని బిగ్గరగా ఏడుస్తూ యువతి చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. మొదట ఏదోలే అనుకున్నా సుమారు రెండు గంటల పాటు వినిపించిన అరుపులు వారిని కదిలించాయి. తొలుత భయపడ్డా తర్వాత సాహసించి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు.. విద్యార్థులు భ్రమపడ్డారని పోలీసులు కొట్టిపారేస్తున్నా.. ఏదో జరిగిందని విద్యార్థులు కచ్చితంగా చెబుతున్నారు. ఆలస్యంగా వెల్లడైన ఈ సంఘటన గురించి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం పట్టణంలోని మహిళా కళాశాల సమీపంలో ఎస్టీ హాస్టల్ ఉంది. రోజూ సాయంత్రం వేళ సమీపంలోని ఆలయం నుంచి వచ్చే పాటలు హాస్టల్ విద్యార్థులు వింటూంటారు. గత నెల 28న సాయంత్రం 6.30 గంటల సమయంలో పాటలకు బదులుగా రక్షించమని రోదిస్తూ యువతి చేసిన అరుపులు వినిపించాయి. ఏడుస్తున్న అమ్మాయి గొంతు నొక్కినట్లుగా కూడా వినిపించింది. ఊపిరి కూడా పీల్చుకోలేనట్లు అనిపించడంతో ఎవరో యువతి ప్రమాదంలో ఉందని విద్యార్థినులకు అనుమానం కలిగింది. వెంటనే 100 నంబరుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గంట తర్వాత పోలీసులు తాపీగా వచ్చారు. ఈలోగా విద్యార్థినుల ద్వారా సమాచారం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ ఎర్రన్నాయుడు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, హాస్టల్ వార్డెన్, కొందరు విద్యార్థినులు కళాశాల పరిసరాలు గాలించారు. అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయని భావించారో అక్కడికి కూడా వెళ్లి చూశారు. ఎవరూ కనిపించలేదు. కళాశాల గదుల్లోనూ గాలించారు. ఎవరూ కనిపించకపోగా అరుపులు కూడా ఆగిపోయాయి. దీనికి కారణం గుర్తించలేకపోయినా ఏదో జరిగిందని చెబుతున్న ఎస్టీ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఈ మిస్టరీ తేలే వరకూ విద్యార్థినుల భయాందోళనలు తొలగవు.
అప్పుడప్పుడూ శబ్దాలు వస్తాయి
దీనిపై హాస్టల్ వార్డెన్ ఎర్రన్నాయుడును ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, అమ్మాయి అరుపులు వినిపించాయని విద్యార్థినులు చెప్పారని, కళాశాల వద్దకు వెళ్లి వెతికామన్నారు. ఎవరైనా వచ్చారా అని వాచ్‌మాన్‌ను అడిగితే ఎవరూ రాలేదన్నాడన్నారు. రోజూ ఏవో అరుపులు వినిపిస్తుంటాయని, గాజుల శబ్దం, ఎవ రో నడిచి వెళ్తున్నట్లు, చిన్న శబ్దాలు రాత్రి వేళ వినిపిస్తుంటాయని వాచ్‌మన్ చెప్పాడన్నారు.
విద్యార్థినుల భ్రమ
దీనిపై శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావును ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, సమాచారం తెలిసిన వెంటనే తమ సిబ్బంది వెళ్లి వెతికినా ఏ జాడ కనిపించలేదన్నారు. తాను హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడానని, ఏదో భ్రమతో అలా ఊహించుకుని ఉంటారే త ప్ప ఏం జరగలేదన్నారు.
అధ్వానంగా పరిసరాలు
కళాశాల పరిసర ప్రాంతాలు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.అపారిశుద్ధ్య వాతావరణంలోనే విద్యార్థులు భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కళాశాల ప్రాంగణంలో తుప్పలు భయాన్ని కలిగిస్తున్నాయి. పగలు కూడా వంటరిగా తిరగలేని విధంగా ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. కళాశాల ఆవరణలో విద్యుత్ దీపాలు పూర్తి స్థాయిలో లేవు. సాయంత్రమైతే కళాశాల ఆవరణలో ప్రవేశించాలంటే విద్యార్థులు భయపడే విధంగా వాతావరణం ఉంది.
Advertisement
Advertisement