‘మార్కెట్‌’ పగ్గాలు సగానికి సగం మహిళలకే | Womens will take over as chairpersons of half the market committees in the state | Sakshi
Sakshi News home page

‘మార్కెట్‌’ పగ్గాలు సగానికి సగం మహిళలకే

Published Sun, Nov 24 2019 3:29 AM | Last Updated on Sun, Nov 24 2019 10:56 AM

Womens will take over as chairpersons of half the market committees in the state - Sakshi

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో సగానికి సగం మార్కెట్‌ కమిటీల చైర్‌పర్సన్‌లుగా మహిళలు బాధ్యతలు స్వీకరించనున్నారు. కమిటీల్లో కూడా సగం మంది మహిళలే సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించిన ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని, వీరంతా రైతులకు ఉపయోగపడేలా కమిటీల పాలనా వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తొలి సారిగా 50 శాతం నామినేటెడ్‌ పదవులను మహిళలకు రిజర్వ్‌ చేస్తానన్న వైఎస్‌ జగన్‌ హామీ కార్యరూపం దాలుస్తుండడంతో వీరికి ఈ అవకాశం లభిస్తోంది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా వర్గాల వారు 50 శాతం మందిని ఎంపిక చేసేలా కసరత్తు సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 220 మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు వీటిలో సగం.. అంటే 110 కమిటీలకు చైర్‌పర్సన్‌లుగా మహిళలు రానున్నారు. జిల్లాను యూనిట్‌గా చేసుకుని కమిటీల రిజర్వేషన్ల ప్రక్రియ కసరత్తు జరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం మార్కెట్‌ కమిటీల నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయనుంది.
 
నియోజకవర్గానికి ఒకటి తప్పనిసరి.. 

శాసనసభ్యుల కోరిక మేరకు రాష్ట్రంలోని మార్కెట్‌ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మార్కెట్‌ కమిటీ తప్పనిసరిగా ఉండేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 191 మార్కెట్‌ కమిటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్‌ కమిటీలు లేని నియోజకవర్గాల్లో  కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 220 మార్కెట్‌ కమిటీలు రైతులకు సేవలందిస్తాయి. ఎమ్మెల్యేను మార్కెట్‌ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యేతో సహా 20 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు అధికారులు, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు. ఎమ్మెల్యే, వ్యాపారులు, అధికారులు కాకుండా మిగతా సభ్యులందరూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి. భూమి లేకున్నా, పాడి పశువులున్న వారిని సభ్యులుగా పరిగణిస్తారు. సభ్యులుగా (అధికారులు మినహా) సైతం సగం మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.  

గ్రామాల్లో సందడి  
ప్రభుత్వం రాష్ట్రంలోని మార్కెట్‌ కమిటీలకు చైర్‌పర్సన్‌లను, సభ్యులను నియమించనుందనే సమాచారం రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. కమిటీల చైర్‌పర్సన్‌లు, సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయం, పంటల ధరవరలు, క్రయ విక్రయాలపై అవగాహన కలిగిన వారి పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేయనున్న ఉత్తర్వుల ప్రకారం ఏడాది కాలానికి కమిటీ ఏర్పాటవుతుంది. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement