సాక్షి, విశాఖపట్నం: విభజన తర్వాత విశాఖ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైనందున అందరి దృష్టి దీనిపైనే ఉంటుందని, ఈ నేపథ్యంలో శాంతిభద్రతలపై నిరంతరం ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు కలెక్టర్ యువరాజ్, డీఐజీ ఉమాపతి, ఎస్పీ కోయ ప్రవీణ్‌లకు సూచించారు. గవర్నర్ బంగ్లాలో మంగళవారం మంత్రి గంటా వీరు ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాంతిభద్రతలు, ఇసుక అక్రమ రవాణా, ఫైనాన్స్ కంపెనీల మాయలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇటీవల అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రతిపక్షం నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు తలెత్తాయి.
ఇకపై జిల్లాలో శాంతిభద్రతలను ఎవరూ ప్రశ్నించేలా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలి’ అన్నారు. ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్‌ల బాధ్యత అప్పగించిన నేపథ్యంలో చెలరేగిపోతున్న మాఫియాను అరికట్టాలని సూచించారు. ఇసుక నిల్వలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. రాష్ట్రంలో ఏ ఫైనాన్స్ కంపెనీ మూసివేసినా దాని మూలాలు ఇక్కడే ఉంటున్నాయని, దీనిపై దృష్టిసారించాలని కోరారు.
పర్యాటకంతోనే నగర ప్రతిష్ఠ
సింహాచలం భూ సమస్యను వీలైనంత త్వరగా సమసి పోయేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. గంభీరంలో సమీర్‌కు ఇచ్చిన భూకేటాయింపులపై సమీక్షించారు. భీమిలి నియోజకవర్గంలో క్రీడా మైదానానికి అవసరమైన నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నగరంలో పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపర్చాలని ఇదే నగర ప్రతిష్ఠను కాపాడుతుందన్నారు. అందుకే ఈ నెల 17న పర్యాటకశాఖపై ప్రత్యేక సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్, పోర్టు చైర్మన్, టూరిజం ఉన్నతాధికారులతో నగర పర్యాటకాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నోట్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలోనే ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం గంటా జిల్లా ఎస్పీ ప్రవీణ్‌తో విడిగా మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీలో పలువురు ప్రజాప్రతినిధులు ఎస్పీ పనితీరుపై మంత్రి గంటాకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతో మంత్రి ఎస్పీని ఉద్దేశించి అధికారపార్టీ నేతల విషయంలో చూసీచూడనట్లు పోవాలని సూచించినట్లు సమాచారం.
అందరి దృష్టి విశాఖపైనే..
Published Wed, Sep 10 2014 3:06 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement