చెత్తకాయలు
అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు నాణ్యమైన రాయితీ విత్తన వేరుశనగను పంపిణీ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విత్తన సేకరణ ఏజెన్సీలు ఊజీ, పుల్లలు, నాసులు, రాళ్లు, బొటికెలు కలిగిన నాసిరకం విత్తనకాయలను రైతులకు అంటగడుతున్నాయి. గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వంతో పంతం నెగ్గించుకున్న ఏజెన్సీలు (ఆయిల్‌ఫెడ్, హాకా, మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్) నాణ్యమైన విత్తనకాయలు అందించడంలో మాత్రం విఫలమయ్యాయి.
క్వింటా ధర రూ.4,600 నుంచి రూ.5,090కి పెంచడంతో రైతుకు అదనంగా రూ.300 చొప్పున పడింది. ఈ లెక్కన జిల్లాకు కేటాయించిన 3.50 లక్షల క్వింటాళ్లను పరిగణనలోకి తీసుకుంటే రూ.10.5 కోట్ల అదనపు భారం మోపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం తొలివిడతగా రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ చేపట్టారు. కొన్ని బస్తాల్లోని విత్తనకాయలు మాత్రం బాగానే ఉన్నాయి. వంద శాతం సర్టిఫైడ్ సీడ్ అని ట్యాగ్ తగిలించిన బస్తాలను విప్పి చూస్తే నాణ్యత డొల్ల అని తేలింది. కే-6 రకం విత్తనం నాసిరకంగా ఉండటం చూసి రైతులు లబోదిబోమంటున్నారు.
ఆదేశాలు బేఖాతరు
నిబంధనల ప్రకారం క్వింటా విత్తన వేరుశనగలో 70 మొలకశాతం ఉండాలి. నాలుగు శాతం వ్యర్థాలు ఉండవచ్చు. 96 శాతం ఫిజికల్ ప్యూరిటీ (స్వచ్ఛత), తొమ్మిది శాతం తేమశాతం ఉండాలని విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు చెబుతున్నారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని ప్రాసిసెంగ్ యూనిట్లలో ఇష్టారాజ్యంగా శుద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, కర్నూలు జిల్లా విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాసిసెంగ్ తీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పుల్లలు, నాసులు తగ్గించాలని ఆదేశించినా నాసిరకంవే సరఫరా చేశారు. కనీసం మలి విడత పంపిణీ నాటికైనా విత్తన నాణ్యత ప్రమాణాలు పరిశీలించి అందజేస్తే కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.
రాయితీ విత్తనకాయలపై విముఖత
కోరుకున్న రకాలు సరఫరా చేయకపోవడం, ఆలస్యంగా పంపిణీ చేపట్టడం, నాణ్యతకు తిలోదకాలిచ్చి నాసిరకం అంటగడుతున్నారనే విమర్శలు రావడంతో రైతులు సబ్సిడీ విత్తనకాయలపై విముఖత చూపుతున్నారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 31,715 మంది రైతులు 28,322 క్వింటాళ్ల విత్తనకాయలు తీసుకెళ్లారు. పెద్దవడుగూరులో ఆరుగురు రైతులు మాత్రమే విత్తనకాయలు తీసుకెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గార్లదిన్నెలో 49 మంది, బ్రహ్మసముద్రంలో 57 , హిందూపురంలో 83, గుమ్మఘట్టలో 74, పుట్లూరులో 103, యల్లనూరులో 109 మంది రైతులు మాత్రమే విత్తనకాయలు కొనుగోలు చేశారు. ఈ మండలాల్లో ఒక్క చోట కూడా వంద క్వింటాళ్లకు మించి అమ్ముడుపోలేదు. తనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కనగానపల్లి, గోరంట్ల మండలాల్లో మాత్రమే వేయి క్వింటాళ్లకు పైగా అమ్ముడుబోయాయి. తక్కిన మండలాల్లో 100 -900 క్వింటాళ్ల వరకు పంపిణీ జరిగింది. వేరుశనగ అత్యధికంగా సాగులోకి వచ్చే కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో కూడా నిరాశాజనక స్థాయిలో పంపిణీ జరగడం గమనార్హం.
తమకు కే-6 రకం వద్దంటూ కళ్యాణదుర్గం, రాయదుర్గం డివిజన్‌తో పాటు ధర్మవరం డివిజన్‌లోని కొన్ని మండలాల రైతులు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో తమకు అవసరమైన విత్తనకాయలు తెచ్చుకున్నారు. గతంలో టీఎంవీ-2, జేఎల్-24, పొలాచీ, నారాయణితో పాటు కే-6 రకం విత్తనకాయలు అందజేశారు. అప్పుడు రైతులకు అవసరమైన విత్తనకాయలు తీసుకునే వెసులుబాటు ఉండేది. గతేడాది నుంచి కేవలం కే-6 రకంతో సరిపెడుతుండటంతో రైతులు విత్తన పంపిణీకి దూరమవుతూ వస్తున్నారు.