
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
హైదరాబాద్: లోక్సభ స్పీకర్ తమ రాజీనామాలు తిరస్కరించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఆ పార్టీకే చెందిన మరో ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారితోపాటు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎస్పివై రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరు ముగ్గురూ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతూ లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ గత శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్య కాదన్న అభిప్రాయంతో స్పీకర్ ఉన్నట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాలను తిరస్కరించారు.
ఈ 13 మందిలో జగన్, మేకపాటి, ఎస్పివై రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామ చేసినట్లు వారు చెప్పారు. తమ రాజీనామాలు ఆమోదించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ సిపి నేతలు ముందే చెప్పారు. ఆ విధంగా వారు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు.