సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు శనివారం మరోసారి పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి ఎండీ సాంబాశివారెడ్డి తెలిపారు. గాయం తీవ్రత కారణంగా వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. కత్తిపోటు గాయం నుంచి సేకరించిన రక్త నమూనాలు ల్యాబ్‌కు పంపించగా.. ఆ రిపోర్టులు వచ్చాయని, బ్లడ్ శాంపిల్స్‌లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో గుర్తించామని సాంబాశివారెడ్డి తెలిపారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ని శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. కత్తిపోటుకు గురై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌లో చేర్పించగా.. డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయన ఎడమచేతి భుజానికి తొమ్మిది కుట్లు వేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతి రోజంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గాయానికి వేసిన కుట్లు చిట్లిపోకుండా ఉండేందుకు ఎడమ చేతికి సర్జికల్ బ్యాగ్ అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment