
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన జగన్
♦ మన పార్టీ కోసం సహాయసహకారాలు అందిస్తారు
♦ నరేంద్ర మోదీ గెలుపులో ఆయనదే క్రియాశీలకపాత్ర
♦ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా: జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఆదివారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. దేశ రాజకీయాల్లో అవగాహన ఉన్న వారందరికీ ఆయన తెలిసే ఉంటారని చెప్పారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. అదేవిధంగా బిహార్‌లో నితీశ్ కుమార్‌ను గెలిపించారని చెప్పారు. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుస్తుందని అందరూ అంచనాలు వేస్తున్న సమయంలో తన వ్యూహాల ద్వారా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారన్నారు.
అయితే ఒక్క ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కాస్త దెబ్బతగిలిందని, అందుకు కారణాలు అందరికీ తెలిసినవేనని వైఎస్ జగన్ అన్నారు. రానున్న ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటారని, సహాయసహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు ఇక్కడ ఏకమై రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చిస్తున్నామని, చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేసేందుకు దశదిశా నిర్దేశించుకుంటున్నామని చెప్పారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ తనను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.