నైపుణ్యాభివృద్ధిరస్తు | YS Jagan key decision on Skill Development University in Amaravathi | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధిరస్తు

Published Sat, Oct 26 2019 3:18 AM | Last Updated on Sat, Oct 26 2019 12:13 PM

YS Jagan key decision on Skill Development University in Amaravathi - Sakshi

సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు, శిక్షణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చదువులు ముగించుకొని విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ యూనివర్సిటీ కింద ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ఈ సందర్భంగా  ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 

ప్రపంచం మొత్తం మన రాష్ట్రంవైపు చూసేలా.. 
దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని, ప్రపంచం మొత్తం మన రాష్ట్రంవైపు చూసేలా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలకు అవసరమైన స్థాయిలో మానవ వనరులను అందించి, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. 

ఆలోచనలు సరే.. సమన్వయమే లేదు 
స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపా«ధి కల్పన విషయంలో మంచి ఆలోచనలే ఉన్నప్పటికీ శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారం లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ ఈ కార్యక్రమాలపై నచ్చిన రీతిలో నిధులు ఖర్చు చేస్తోందని, ఈ విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో కొత్తగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న 25 కళాశాలలు ఈ యూనివర్సిటీకి అనుబంధంగా పని చేస్తాయన్నారు. ప్రభుత్వం తరఫున చేపట్టే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఇందులో భాగస్వామిగా మారుతుందన్నారు. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లోనూ అత్యుత్తమ శిక్షణ 
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, భవిష్యత్తు అవసరాల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ తగిన ప్రణాళికలను రూపొందిస్తుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీకాం సహా ఇతరత్రా డిగ్రీలు  చదువుతున్న వారిలో నైపుణ్యాలు పెంచడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీతో అనుసంధానిద్దామని చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో(ఏఐ) విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్యాలను నేర్పించే బాధ్యతను యూనివర్సిటీ స్వీకరిస్తుందని వివరించారు. ఈ యూనివర్సిటీ, దాని పరిధిలో కాలేజీల ఏర్పాటుపై నెల రోజుల్లోగా కార్యాచరణ పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

జాబ్‌ మేళాలతో ప్రయోజనమేదీ? 
ప్రభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, జాబ్‌ మేళాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎవరు శిక్షణ ఇస్తున్నారు? శిక్షణ ఇస్తున్నవారిలో నాణ్యత ఉందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదని, దీనివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. జాబ్‌ మేళాలు కూడా ఆశించినట్టుగా లేవన్నారు. ఒకటి రెండు నెలలు శిక్షణ ఇచ్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఏముంటుందని  వ్యాఖ్యానించారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో(ఎన్‌ఏసీ) మాదిరిగా శిక్షణ ఉండాలన్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాల కోసం ప్రభుత్వ శాఖలు విడివిడిగా ఖర్చు చేయడం నిలిపేయాలని ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఇకపై ఆర్థిక శాఖ నుంచే నేరుగా నిధులు ఖర్చు చేస్తామని సీఎం వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, కళాశాలల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఆయా పనుల పర్యవేక్షణకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నట్టు చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో నియామకం జరగాలన్నారు. 

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజీలకు డిజిటల్‌ ఎక్స్‌టెన్షన్‌ 
ప్రస్తుతం ఉన్న ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజీలకు డిజిటల్‌ ఎక్స్‌టెన్షన్‌ ఉండాలని స్పష్టం చేశారు. ఓలా, ఉబర్‌ తరహాలో యాప్‌ రూపొందించాలన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఎక్కడున్నాయన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని, గ్రామ సచివాలయాల స్థాయిలో ఈ మ్యాపింగ్‌ జరగాలని చెప్పారు. ప్లంబర్, మెకానిక్, డ్రైవర్‌.. ఇలా నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా సరే యాప్‌లో రిజిస్టర్‌ చేయించుకుంటే, వారి సేవలను సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుందని, వారికి తగిన ఉపాధి కూడా లభిస్తుందని వివరించారు.  

అప్రెంటీస్‌ పూర్తయ్యాకే పరీక్షలు 
విద్యార్థులు మొక్కుబడిగా డిగ్రీలు పూర్తి చేయడం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీఏ, బీకాం వంటి కోర్సుల పాఠ్యప్రణాళికను పునఃపరిశీలించేందుకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ ఉండాలని చెప్పారు. కాలేజీ నుంచి విద్యార్థి బయటకు రాగానే ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా సిలబస్, శిక్షణ ఉండాలని అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులతో అదనంగా ఏడాది పాటు అప్రెంటీస్‌ చేయించాలని సూచించారు. అప్రెంటీస్‌ చేశాక అవసరం అనుకుంటే మళ్లీ ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. దీనిపై నెలరోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement