
సీతారామపురం: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ప్రజాప్రతినిధులతో కలిసి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తమ సమస్యలు విన్నవించుకుంటూ సీఎం అయి తమ బాధలు తీర్చాలని చెబుతున్నారన్నారు.
చంద్రబాబు రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా ముంచారన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా తన ఎంపీలతో పార్లమెంట్‌లో కపట నాటకం ఆడుతూ కేంద్రంలో తన మంత్రులను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన టీడీపీకి త్వరలోనే తగిన శాస్తి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, ఎంపీపీ కల్లూరి జనార్దన్‌రెడ్డి, మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ అల్లూరురాజు, ఎంపీటీసీ పద్మావతి, సర్పంచ్ పి.మాల్యాద్రి, ఎం.రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.