ఐకేపీ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం | ys jagan mohan reddy gave support to ikp employees | Sakshi
Sakshi News home page

ఐకేపీ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం

Published Sun, Feb 9 2014 1:22 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

ఐకేపీ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం - Sakshi

ఐకేపీ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) కింద పనిచేస్తోన్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

 అధికారంలోకి రాగానే నిర్ణయం
 ఐకేపీ ఉద్యోగ సంఘాల నేతలకు జగన్ అభయం
 డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని పునరుద్ఘాటన
 
 సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) కింద పనిచేస్తోన్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం విశాఖ జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చోడవరం బహిరంగ సభకు వెళుతున్న జగన్‌ను.. కొత్తూరు జంక్షన్ వద్ద సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగ సంఘాల తరఫున 30 మంది ఉద్యోగులు కలిశారు. సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2008లో ముఖ్యమంత్రి వైఎస్‌ను కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 42వేల మంది ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరామని, ఎన్నికల తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఆయన మరణం తర్వాత తమను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కష్టాలు విన్న జగన్ స్పందిస్తూ.. ‘‘మహిళలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాలు.. వారి మొహాల్లో చిరునవ్వు చూడాలన్నదే మా లక్ష్యం. అందుకోసం దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకు వస్తున్నాం.
 
 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దీనిపై సంతకం చేస్తాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపాలి.. ఆ పిల్లలు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి తల్లిదండ్రులకు అన్నంపెట్టే పరిస్థితిలోకి రావాలి. ఆ అక్క చెల్లెమ్మలు పిల్లల్ని ఇలా బడికి పంపినందుకు.. ఒక్కో చిన్నారికీ నెలకు రూ. 500 చొప్పున అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ఒక్కో కుటుంబంలో ఇలా చదువుకునే ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తింపజేస్తాం. అంతేకాదు మహిళల జీవితంలో కొత్తదనం తెచ్చే దిశగా అక్క, చెల్లెళ్ల డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తాం. ఈ మాఫీ చేసే కార్యక్రమంలో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే వీవోఏలు, సంఘమిత్రలు, సీసీలందరినీ కచ్చితంగా క్రమబద్ధీకరించి వారికి అండగా నిలుస్తాం’’ అని భరోసా ఇచ్చారు.
 
 రాష్ట్ర ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం
 తమ పార్టీ అధికారంలోకి వస్తూనే ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇందిర క్రాంతి పథం ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. దశాబ్దాలుగా అరకొర వేతనంలో అత్తెసరు జీవితాలు గడుపుతున్న ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీ ద్వారా జగన్ తమ జీవితాల్లో  వెలుగు నింపారని సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.ధనంజయ, డి.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కె.ఎస్.గురురాజు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత కిందిస్థాయి ఉద్యోగుల కష్టాలను తొలగించాలనే జగనన్న ఉదాత్త ఆశయానికి ఆయన హామీనే నిదర్శనం. ఐకేపీ ఉద్యోగుల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్న జగనన్నకు మా ఐకేపీ సిబ్బంది, సభ్యులంతా అండగా ఉంటాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కలసికట్టుగా కృషిచేస్తాం’’ అని సంఘం నేతలు ‘సాక్షి’తో చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement