
జగన్ బెయిల్ షరతుల పిటిషన్ 18కి వాయిదా
బెయిల్ షరతుల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 18కు వాయిదా పడింది.
హైదరాబాద్ : బెయిల్ షరతుల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 18కు వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలంటూ సీబీఐ ఈ సందర్భంగా కోర్టును కోరింది. దీంతో పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు సడలింపు నివ్వాలని జగన్ కోర్టును కోరారు. సమైకాంధ్ర ఉద్యమంలో పాల్గొనాల్సి ఉంది. ప్రజల మనోభావాలను తెలుసుకోవాల్సిన అవసరం పార్టీ అధినేతగా తనపై ఉందని జగన్ కోరారు.
మరోవైపు బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు షరతులను సడలించాలంటూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. కోర్టు వాయిదాకు హాజరైతే షరతుల నుంచి మినహాయింపు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని సీబీఐ- కోర్టుకు తెలిపింది.