
సాక్షి, రాజమహేంద్రవరం: అప్పటి వరకూ భారీ వర్షం పడి, మళ్లీ కమ్ముకున్న కారుమబ్బులు ప్రజాభిమాన వెల్లువతో తేలిపోయాయి. మధ్యాహ్నం వరకు వరుణుడి హోరు.. సాయంత్రం జనజోరులో రామచంద్రపురం పట్టణం తడిసి ముద్దయ్యింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. వైఎస్ జగన్ ప్రసంగానికి జేజేలు పలికారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే జగన్ తన పాదయాత్రను జగన్నాయకులపాలెం నుంచి ప్రారంభించారు. మధ్యాహ్నం మూడు గంటలకు వరుణుడు శాంతించడంతో సాయంత్రం జరిగే బహిరంగసభకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్న భావన నెలకొన్న సమయంలో ఒక్కసారిగా దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంటుందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఉప్పెనలా జన ప్రవాహం వెల్లువెత్తింది. వెల్ల జంక్షన్ నుంచి రామచంద్రపురం పట్టణం మార్కెట్ సెంటర్‌లోని బహిరంగ ప్రదేశం వరకు రోడ్డు పొడవునా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, యువత, కాలేజీ, పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో నిలుచున్నారు. వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. డప్పులు, బాణసంచా పేలుళ్లతో రామచంద్రపురం పట్టణం మార్మోగిపోయింది.
సాయంత్రం 4:40 గంటలకు ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రసంగం 5:43 గంటల వరకు సాగింది. పాదయాత్రలో స్థానిక ప్రజలు తన దృష్టికి తెచ్చిన నెలపర్తిపాడు పంచాయతీ పరిధిలోని రోడ్డు ఏర్పాటులో వివక్ష, నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కొరత సమస్య, ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత, రక్షిత నీటి పథకాల నిర్వహణ లోపం తదితర సమస్యలను ఎత్తి చూపుతూ వైఎస్ జగన్ ప్రసంగం సాగింది. నియోజకవర్గం అభివృద్ధికి పాలకులు ఇచ్చిన హామీలు అటకెక్కాయంటూ ద్రాక్షారామ రింగ్ రోడ్డు, రామచంద్రపురం డంపింగ్ యార్డు తరలింపు అంశాలను ప్రస్తావిస్తూ ఇలాంటి పాలన మనకు కావాలా? అంటూ ప్రజల అభిప్రాయం అడగ్గా ప్రజలు వద్దూ వద్దూ అంటూ చేతుల పైకెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆ రాజకీయ నాయకుడిని ఇంటికి పంపేలా, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు తనకు మీ అందరి సహకారం కావాలని కోరుతూ, ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అశేష జనవాహిని పాదయాత్రలో వెంట రాగా రాత్రి బసకు పసలపూడి చేరుకున్నారు.
పాదయాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్ప యాత్ర 207వ రోజు రామచంద్రపురం రూరల్ మండలం జగన్నాయకులపాలెం నుంచి ప్రారంభమైంది. తనను చూసేందుకు వేకువజాము నుంచి వేచియున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉదయం 8:40 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. వివిధ వర్గాల ప్రజల వినతులు స్వీకరించిన జగన్ వాటిని పరిశీలిస్తూ ముందడుగు వేశారు. చినతాళ్లపొలం గ్రామంలో గ్రీన్ కార్పెట్ పరిచి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 2011లో ఓదార్పు యాత్రలో తన ఏడు నెలల కుమారుడికి వైఎస్ జగన్‌తో రాజశేఖరరెడ్డి అని నామకరణం చేయించుకోవడంతో తన కుటుంబానికి రేషన్‌కార్డు, తనకు వికలాంగ పింఛన్ నిలిపివేశారని మారిశెట్టి రూతమ్మ అనే దివ్యాంగురాలు వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేసింది.
పెదతాళ్లపాలెంలో అభిమానాలు, అక్కాచెల్లెమ్మలు ఎదురేగి స్వాగతం పలికారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసే తన కుమారుడు ప్రకాశ్ దమ్ము ట్రాక్టర్ తిరగబడడంతో చనిపోయాడని మేడిశెట్టి వెంకట లక్ష్మి జగన్ వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్ తాను అండగా ఉండానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. ఆర్టోస్ కంపెనీ వద్ద కార్మికులు ఇచ్చిన శీతల పానీయం జగన్ రుచి చూశారు. వెల్ల జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం అనంతరం సాయంత్రం తిరిగి పాదయాత్ర మొదలైంది. రామచంద్రపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలు జగన్‌కు నీరాజనాలు పలికారు. అశేష జన సందోహాన్ని ఉద్దేశించి సాగిన వైఎస్ జగన్ ప్రసంగం స్థానిక సమస్యలను స్పృశిస్తూ, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, వివక్ష పాలనను ఎండగడుతూ సాగింది. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర మండపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రాయవరం మండలం పసలపూడిలోని రాత్రి బస చేసేందుకు జగన్ ఆగారు. శనివారం వైఎస్ జగన్ 8.4 కి.మీ మేర నడిచారు.
పాదయాత్రలో పార్టీ శ్రేణులు...
207వ రోజు ప్రజా సంకల్ప యాత్ర, బహిరంగ సభలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, నరసాపురం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాల్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, అనంత ఉదయ్‌భాస్కర్, వేగుళ్ల లీలాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పార్టీ నేతలు పితాని అన్నవరం, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టికూటి రాజశేఖర్, యువ నేత పిల్లి సూర్యప్రకాశ్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు, రాష్ట్ర బీసీ విభాగం కార్యనిర్వాహక సభ్యుడు వాసంశెట్టి శ్యామ్, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు యనమదల మురళీకృష్ణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు టేకిమూడి సత్యనారాయణ, చిల్లే నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, రామచంద్రపురం పట్టణ కన్వీనర్ గాదెంశెట్టి శ్రీధర్, రామచంద్రపురం మండల కన్వీనర్ పంతగడ విజయప్రసాద్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా ఆదివారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, పాదయాత్ర 2500 కిలో మీటర్లు సాగిన సందర్భాలను పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రతినిధులు తెలిపారు.
వివక్ష చూపుతున్నారన్నా...!
పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు, స్థానికులు తమ సమస్యలు, కష్టాలను వైఎస్ జగన్‌కు చెప్పుకున్నారు. స్థానిక నేతలు అభివృద్ధి చేయాల్సింది పోయి రోడ్డు పనులు అడ్డుకుంటున్నారని రామచంద్రపురం సమీపంలోని నెలపర్తిపాడు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. పది గ్రామాల ప్రజల రాకపోకలకు అవసరమై రోడ్డు కోసం రూ.40 లక్షలు మంజూరైతే ఎమ్మెల్యే వెనక్కి పంపేశారని వాపోయారు. కాపు సామాజిక వర్గంలోని పేదలకు రుణాల మంజూరులో కాపు కార్పొరేషన్ కపట నాటకం ఆడుతోందని కాకినాడ రూరల్‌కు చెందిన లింగం రవి జగన్‌కు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలతో తమకు మేలు జరుగుతుందని విశ్వ బ్రాహ్మణులు జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఎండ, వానకు తడుస్తూ తెగిన చెప్పులు కుట్టుకుంటున్న తమ బతుకుల్లో వెలుగులు నింపాలని చర్మకారులు వినతిపత్రం ఇచ్చారు. శ్మశాన స్థలం, కమ్యూనిటీ భవనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నియోజకవర్గ ఫెలోషిప్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమను మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు వాపోయారు.
ఎరువులు, పురుగు మందుల ధరలు భారంగా మారాయని, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని రైతు మట్టపర్తి వెంకట్రావు కోరారు. వైఎస్సార్ సీపీకి మద్దతుదారుడనే నెపంతో తనను అన్యాయంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు నుంచి తొలగించారని దడాల సూర్యనారాయణ భార్య పిల్లలతో వచ్చి జగన్‌కు చెప్పుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భర్తకు వైద్య సహాయమందించాలని షేక్ రాజాబీ వేడుకుంది. తాతపూడి జయమ్మ, మట్టపర్తి వెంకాయమ్మ తదితరులు తమకు అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదని జగన్ వద్ద వాపోయారు. పింఛన్ ఇప్పించాలని కోరారు.