
నాన్నలానే అండగా ఉంటా
దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తరహాలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా ఏపీఎన్‌జీవోలకు జగన్‌మోహన్‌రెడ్డి హామీ
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తరహాలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు రాకుండా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగా భావిస్తామని, కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని చెప్పారు.
ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కూడిన ప్రతినిధిబృందం ఆదివారం జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయింది. ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టే చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏపీఎన్‌జీవో నేతలు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల అంశాలకు సంబంధించి వినతిపత్రంలో తాము చేసిన డిమాండ్‌కు జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఏపీఎన్‌జీవోల డిమాండ్లు ఇవీ...
కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, దశల వారీగా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలి. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా హెల్త్‌కార్డుల పథకం అమలు చేయాలి. 2013 జూలై నుంచి పదో పీఆర్‌సీ అమలుపరచాలి. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ విషయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులందరికీ ఆప్షన్ సౌకర్యం కల్పించే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో వారికి ఇళ్లు/స్థలం మంజూరు చేయాలి. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలి. అవుట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలి.