చంద్రబాబు నాయుడు కూడా అంతే: వైఎస్ జగన్
కడప : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకునేవారు కాలగర్భంలో కలిసి పోయారని, చంద్రబాబు నాయుడు కూడా అంతేనని, అటువంటి నియంతలు ఎక్కువ కాలం నిలబడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జమ్మలమడుగు కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎర్రగుంట్లలో 20 కౌన్సిలర్ స్థానాలకు 18 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, అయితే ప్రజాస్వామ్యం కుంటుపడి కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు క్యాంప్లను నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
చంద్రబాబు నాయుడు ఒత్తిడితో భయపెట్టి ఎనిమిదిమంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుందని, అయినా దేవుడు చంద్రబాబుకు మొట్టికాయ వేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాడన్నారు. నాలుగు జిల్లా పరిషత్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి టీడీపీ గెలిచేందుకు యత్నించిందని వైఎస్ జగన్ అన్నారు. కడప తప్ప కర్నూలు, ప్రకాశం, నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. చంద్రబాబు ఏకంగా జెడ్పీటీసీలతో ఫోన్లో మాట్లాడే స్థాయికి దిగజారారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
అయితే నిజమైన ప్రతిపక్షం చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, ప్రజలేనని వైఎస్ జగన్ అన్నారు. రాబోయే కాలంలో వారే బాబును నిలదీస్తారన్నారు. త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. మీతోపాటు ఏ పోరాటం చేయడానికైనా తాను ముందుంటానని, అందరం కలిసికట్టుగా కలుద్దామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కౌన్సిలర్లకు సూచించారు.