
ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆయనకేంటి...
హైదరాబాద్ : నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడుకు బుద్ధి రావాలనే శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే తమ మద్దతు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమని ఆయన చెప్పారు. అలాగే ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక పార్టీ కూడా తమదేనని వైఎస్ జగన్ అన్నారు. విలువలు లేని టీడీపీ పార్టీకి బుద్ధి రావాలనే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని ఆయన తెలిపారు. విలువలు లేని రాజకీయాలు చేసేవారికి గట్టిగా బుద్ధి రావాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్ఆర్ సీపీ మద్దతు ఇచ్చిందని, ఆ పార్టీ అంతగా దిగజారిపోయిందని చంద్రబాబు నాయుడు విజయవాడలో వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యకరంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు నిజంగా నమస్కారం పెట్టాలా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తమ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆయనకు ఏంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఒకే స్టాండ్పై ఉందని, చంద్రబాబులాగా తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్లో మరోలా మాట్లాడలేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయిన టీడీపీ... శాసనమండలిలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీని డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్తో కుమ్మక్కు కాలేదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అటువంటి పార్టీ ఇప్పుడు తమను ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు...కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు విప్ జారీ చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.