చిత్తూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిల కుమ్మక్కు రాజకీయాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి కిరణ్, చంద్రబాబులు కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా నాగలాపురం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రస్తుతం రైతులను పట్టించుకునే నాథుడే లేడని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను చూస్తే బాధేస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజల వినిపించే సమైక్య నినాదం ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి వినబడాలన్నారు.
'రానున్న ఎన్నికల్లో మనం ఎక్కువమందిని పార్లమెంట్ కు పంపిద్దాం. అప్పుడు మనరాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవడికుందో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఎవరుంచుతారో...వారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం. ఆమెది మన దేశం కాదు.. మన భాషా రాదు. రాష్ట్రాన్ని మాత్రం విభజిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే అడ్డగోలు విభజన చేస్తున్నారని'జగన్ తెలిపారు.