
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
* నేడు ఘటనాస్థలికి వైఎస్సార్‌సీపీ అధినేత
సాక్షి, హైదరాబాద్: నగరం దుర్ఘటన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఆయన సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి.. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరారు.
శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుని.. అనంతరం విమానంలో రాజమండ్రికి వెళతారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో ఘటనాస్థలికి చేరుకుంటారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే.. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఘటనకు దారితీసిన కార ణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
బాధితులను ఆదుకోండి: రఘువీరారెడ్డి
గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు.
భద్రతా లోపమే కారణం: వామపక్షాలు
గ్యాస్‌పైప్ లైన్ పేలుడు దుర్ఘటన .. భద్రతా లోపంతోనే జరిగిందని సీపీఐ, సీపీఎంలు పేర్కొన్నాయి. ఓఎన్‌జీసీ, గెయిల్ సంస్థలే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి.
టీ సీఎం కేసీఆర్ సంతాపం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ లీకేజీతో ఎగసిపడిన మం టల్లో పదహారు మంది సజీవ దహనం అయిన సంఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
* టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాల కృష్ణ, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కూడా పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.