సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. విశాఖ జిల్లా అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎనలేని మక్కువ. అందుకే.. జిల్లాను అగ్రగామిగా నిలపాలని.. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. ఎన్నో ‘మేళ్లు’ చేసేందుకు కృషి చేశారు.. చేస్తున్నారు. ఏడాది పాలనలో జిల్లాకు అనేక వరాలు అందించి.. ప్రతి ఒక్కరూ సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. మూడు రాజధానుల నిర్ణయంలో.. విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి.. అందరి దృష్టి జిల్లాపై పడేలా చేశారు. ట్రామ్ రైలు.. పోలవరం నుంచి జలాల తరలింపు.. గిరిజనుల కోసం వైద్య కళాశాల.. మత్స్యకారుల వలసల నివారణకు ఫిషింగ్ హార్బర్.. నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1300 కోట్లతో నగరాభివృద్ధి పనులు.. పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు డీశాలినేషన్ ప్లాంట్.. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాన్సెప్ట్ సిటీ.. ఒకటి కాదు.. రెండు కాదు.. అభివృద్ధి చెయ్యాలన్న తలంపు ఉంటే.. ఇలా ఉంటుందా అన్న రీతిలో జిల్లాను నభూతో నభవిష్యత్ అన్నట్లు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. (చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..)
నగరానికి రాజయోగం..
2020 జనవరి 20.. విశాఖ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. తరతరాలుగా రాజధానులకు రాదారిగా నిలిచిపోయిన విశాఖ ఇన్నేళ్లకు అసలైన రాజధానిగా అవతరించేందుకు మార్గం సుగమమైన రోజు. నాన్నకు మించిన పాలన అందిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెప్పడమే కాకుండా.. దాన్ని నిజం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలుగొందిన విశాఖ.. ఆ తర్వాత మసకబారిపోయింది. మళ్లీ.. జిల్లాకు జీవం పోస్తూ.. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా పరిపాలన రాజధానిగా పట్టం కట్టారు. 2019 డిసెంబర్ 18న శాసనసభలో సూత్రప్రాయంగా స్వయంగా ప్రకటించిన సీఎం.. అక్కడికి నెల రోజుల్లోనే మూడు రాజధానుల ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి.. వ్యవస్థలు విశాఖకు రానున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన వ్యవస్థ ప్రారంభం కానుంది.
తాగునీటికి పోలవరం..
ప్రతి వేసవిలో నగరవాసుల నీటి కష్టాలు అడుగడుగునా దర్శనమిస్తుండేవి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు పెంచకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్న విషయాన్ని గ్రహించిన సీఎం.. గోదావరి జలాలు విశాఖకు అందించాలని సంకలి్పంచారు. విశాఖ నగరానికే కాకుండా.. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలతో పాటు పాయకరావుపేట, అనకాపల్లి రూరల్ గ్రామాలకు ఈ పైప్‌లైన్ ద్వారా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి నరవకు రూ.3,600 కోట్ల అంచనా వ్యయంతో రోజుకు 190 ఎంజీడీల నీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారు చెయ్యాలని సీఎం ఆదేశించడంతో జీవీఎంసీ సన్నద్ధమవుతోంది. ఈ పైప్‌లైన్ ప్రాజెక్టు పూర్తయితే.. 24 గంటలూ నగర ప్రజలకు తాగునీరు అందనుంది.
పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్ ప్లాంట్
పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టుకు సీఎం రూపకల్పన చేశారు. మంచినీరు ప్రజలకు అందించి.. ఉప్పు నీటిని మంచినీటి ప్రక్రియగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియపై దృష్టి సారించారు. ఇజ్రాయిల్ దేశం మొత్తం డిశాలినేషన్ నీటిని అన్ని అవసరాలకూ వినియోగిస్తున్న నేపథ్యంలో.. పారిశ్రామిక అవసరాలకు మంచినీటిని కాకుండా డిశాలినేషన్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇజ్రాయిల్ దేశానికి చెందిన సంస్థలు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి. పరిశ్రమలకు అందించేందుకు 45 ఎంజీడీ ప్లాంట్‌ని మింది పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
విశాఖలో కాన్సెప్ట్ సిటీ
విశాఖపట్నం అత్యంత ప్రాధాన్యతతో కూడుతున్న జిల్లా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందుంది. ఆ మేరకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్ని తలదన్నేలా దూసుకెళ్లే నగరాల్లో విశాఖ ది బెస్ట్ అని భావించిన సీఎం.. నగరంలో కాన్సెప్ట్ సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖ శివారులో ఐటీ సంస్థల కోసం కాన్సెప్ట్ సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 1000 నుంచి 1500 ఎకరాల్లో అన్ని అంతర్జాతీయ ప్రధాన ఐటీ సంస్థలకు కావల్సిన సమగ్ర మౌలిక సదుపాయాలు కలి్పంచేలా ఈ సిటీ రూపుదిద్దుకోనుంది.
‘ఉత్తరాంధ్ర’ ఉరకలు
ఉత్తరాంధ్ర మాగాణుల్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు తరలిరానున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టుని పట్టించుకోకుండా అంచనా వ్యయం పెంచుతూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. అన్నదాతల ఆశల్ని నీరుగార్చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ హయాంలో సంకల్పించిన బాబూ జగజ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2009 ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. వైఎస్ హయాంలో రూ.7214.10 కోట్ల అంచనాలతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు వ్యయం కాస్తా టీడీపీ హయాంలో రూ.16,568 కోట్లకు చేరింది. తొలిదశ పనుల అంచనా వ్యయం నాడు రూ.801కోట్లు కాగా.. నేడు రూ.2022 కోట్లకు చేరింది. ప్రాజెక్టు ద్వారా తొలిదశలో జిల్లాలో 8 మండలాల్లో 1.39లక్షల ఎకరాలు సాగునీరు అందేలా డిజైన్ చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి అడుగు వేశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణాల కోసం తొలి బడ్జెట్‌లోనే రూ.170.06 కోట్లు కేటాయించారు. పొరుగు జిల్లా నుంచి విశాఖకు వచ్చే జలాలు అందించే ప్రాజెక్టుల కోసం పురుషోత్తపట్నానికి రూ.300 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకు రూ.55 కోట్లు, తారకరామ తీర్థ సాగరానికి రూ.21 కోట్లు కేటాయించి.. పనులు పరుగులు తీసేలా చేశారు.
రూ.661 కోట్లతో స్కిల్‌డెవలప్‌మెంట్ వర్సిటీ
వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో ఉపాధి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విద్యార్థులు చదివిన చదువుకు తగిన ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నారు. ఈ దుస్థితిని నుంచి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విశాఖ యువతకు అందుబాటులో ఉండేలా అంతర్జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో రూ.661 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అంతేకాకుండా జిల్లాలోని ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో రూ.10 కోట్లు చొప్పున మూడ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో ట్రేడ్‌కు 30 మందికి చొప్పున 12 ట్రేడ్‌లలో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ అందనుంది.
పల్లె ప్రజలకు ‘వైద్యం’ వెలుగులు
అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లుండే రూరల్ జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. మన్యం ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు రావాలంటే వైద్య సదుపాయాలు కచ్చితంగా ఉండాలని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే గిరిజనులకు ఆధునిక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో పాడేరులో వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పాడేరు ఏరియా ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తూ.. అందులోనే అదనపు భవనాలు నిర్మించి.. మెడికల్ కాలేజీని ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అలాగే రూరల్ జిల్లా ప్రజల కోసం అనకాపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
పుష్కర కాలం తర్వాత ‘మహా’పోరు
జీవీఎంసీకి 2007లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత.. ఆ పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసిపోయింది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. వార్డుల పునరి్వభజన పేరుతో ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వార్డుల సంఖ్యని 98కి పెంచుతూ సరిహద్దుల విభజన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం చేసింది. మార్చి 9న ఎన్నికల నగరా మోగించింది. నోటిఫికేషన్ విడుదల కావడం.. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడం.. చకచకా సాగుతున్న తరుణంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది.
పట్టాల్లేని ట్రామ్ మెట్రో వ్యవస్థకు శ్రీకారం
విశాఖ నగరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నగరం, జిల్లా ఎలా అభివృద్ధి చెయ్యాలనే అంశంపై నిరంతరం ఆలోచన చేస్తున్నారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ఎన్నాళ్ల నుంచో నలుగుతున్నా.. ముందుకు వెళ్లలేదు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. మిగిలిన చోట్లలా కాకుండా.. విశాఖలో మెట్రోకు అంతర్జాతీయ లుక్ రావాలన్న కాంక్షతో.. ట్రామ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 10 దశల్లో 10 కారిడార్లుగా మొత్తం మార్గం 140.13 కిలోమీటర్లు వరకూ మెట్రో సౌకర్యాన్ని నగర ప్రజలకు అందించనున్నారు.
గంగపుత్రుల సంక్షేమమే లక్ష్యంగా..
139 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నా.. సౌకర్యాలు లేకపోవడంతో.. జిల్లాలోని మత్స్యకారులు వలసలు వెళ్లిపోతున్నారు. ఈ వలసలు నివారించేందుకు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ ఏర్పాటు చేయాలన్న కలని నెరవేరుస్తూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన వాప్‌కాస్(వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సరీ్వసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. భీమిలిలో ఫిష్‌ల్యాండ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment