
సడలని సంకల్పం... ఒక్కో అడుగులో వజ్ర సంకల్పం...జనం వ్యధను హృదయంతో అధ్యయనం చేస్తూ, వారి బతుకు గతుకులను మథిస్తూ సాగిన ఆ పాదం వెనుక లక్షల పాదాలు కదం తొక్కాయి. ఒక్కో జిల్లా సరిహద్దు దాటుకుంటూ ప్రభంజనంలా మున్ముందుకు దూసుకుపోతున్న ఆ వేగాన్ని అడ్డుకోడానికి ఎన్నో అడ్డంకులు. మరెన్నో ప్రతిబంధకాలు.. అయినా ‘కదం తొక్కుతూ...పదం పాడుతూ... పదండి పోదామంటూ మహా సంకల్ప యాత్రకు లక్షలాదిగా జనం ఎదురొచ్చి నీరాజనాలు పట్టిన తీరు పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఆ కర్కశులు చివరికి హత్యాయత్నానికే బరితెగించారు. అయితే జనలోకం కన్నెర్ర చేసి శాంతియుతంగానే నిరసించింది.మళ్లీ ఆ నేత అడుగుల సవ్వడి కోసం ఎదురు చూస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘పచ్చ’దనం సాక్షిగా రాష్ట్రంలో నాలుగేళ్లుగా అవినీతి, అరాచకం, అక్రమాలు రాజ్యమేలుతున్న వేళ.. రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాలను పాలకులే మంటగలుపుతున్న వేళ.. జన్మభూమి కమిటీలతో స్థానిక ప్రజాప్రతినిధుల హక్కుల్ని హరిస్తున్న వేళ.. అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల వంటి సంక్షేమ పథకాల అమలులో రాజకీయ వివక్ష పాటిస్తున్న వేళ.. రుణమాఫీపై రైతులు, మహిళల జీవితాలతో ప్రభుత్వం దుర్మార్గపు ఆట ఆడుతున్న వేళ.. మొత్తంగా జనసంక్షేమాన్ని తుంగలో తొక్కిన వేళ.. తెలుగుదేశం ప్రభుత్వ దౌష్ట్యాన్ని దునుమాడుతూ.. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న అన్ని వర్గాల ప్రజల్లో నవచైతన్యాన్ని నింపడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమై మంగళవారానికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది.
ఈ ఏడాది కాలంగా ఆ జననేత నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదం పల్లెపల్లెనూ తాకింది. ఆయన పలుకు జనం గుండెల్లో ధైర్యాన్ని నింపింది. ఓటేసి గెలిపించిన ప్రభుత్వం తమను ఎలా విస్మరించిందో, వివక్షకు గురి చేస్తోందో పాదయాత్ర సందర్భంగా జననేతకు జనం చెప్పుకున్నారు. హామీలు నమ్మి మోసపోయామంటూ గోడు వెళ్లబోసుకున్నారు. పేదలపై కనికరం లేకుండా పాలన సాగిస్తున్న ప్రభుత్వాధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. నిండా మునిగిన తమను ఆదుకోవాలని వేడుకున్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కూలీలు, చిరుద్యోగులు, వలస కార్మికులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలూ సమస్యలు చెప్పునే వేదికలా జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సాగింది. జనం పెట్టుకున్న ఆశలకు తగ్గట్టుగానే జననేత జనం గోడును ఓపిగ్గా విన్నారు. వారి సమస్యలపై అధ్యయనం చేశారు. పేదలకేం చేయాలో శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి చరిత్రలో నిలిచిపోయే పథకాలను రూపొందించారు.
‘నవరత్నాలు’ పేరుతో వాటిని ప్రజలకు వివరించారు. పాలకపక్షం పట్టించుకోకపోయినా ప్రతిపక్ష నేత తమకోసం ఆలోచిస్తున్నారని, శ్రమిస్తున్నారన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. ఇంకేముంది! జననేత పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలిరాసాగారు. పల్లె, పట్టణం, నగరం.. ఎక్కడికి వెళ్లినా జనమే జనం. పాదయాత్రలో జ్వరమొచ్చినా జనం సమస్యలు వింటూనే పాదయాత్రను కొనసాగించారు. మొత్తంగా పాదయాత్రకు జనం నీరా‘జనం’ పలికారు. ఈ ప్రభంజనం చూసిన పాలకపక్షం గుండెల్లో రైళ్ళు పరుగెత్తనారంభమైంది. జనం మధ్యలో ఏమీ చేయలేక విశాఖలో కుట్ర పన్నారు. కత్తితో హత్యాయత్నానికి ఒడిగట్టారు. ప్రజల ఆశీశ్సులు, దేవుని దయ వల్ల జననేతకు ముప్పు తప్పింది. కుట్ర కాస్తా భగ్నం కావడంతో కుట్రదారులు తేలుకుట్టిన దొంగలయ్యారు. అభిమానే దాడి చేశారంటూ కట్టుకథను అల్లారు. జనం నమ్మకపోవడంతో వెకిలి చేష్టలకు బరితెగించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్న చందాన జననేత మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనం మధ్యలో చిరునవ్వు చిందిస్తూ ఆప్యాయతతో కూడిన పలకరింపు కోసం వేచి చూస్తున్నారు.
‘తూర్పు’న జననేత అడుగులు సాగాయిలా..
పాదయాత్ర ప్రారంభమై ఏడాది కాలమైంది. జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి జననేత ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జగన్‌కు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. లక్షలాదిగా జనాలు తరలివచ్చి ‘తూర్పు’లోకి జననేతను తోడ్కొని వచ్చారు. అక్కడి నుంచి ఏకధాటిగా అలుపెరగనివిధంగా పాదయాత్రీకుడు ముందుకు సాగారు. కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్బేధ్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అరుదైన మైలురాళ్లు అధిగమించారు. 2400, 2500, 2600, 2700 కిలోమీటర్ల మైలురాళ్లను దాటి చరిత సృష్టించారు. 200వ రోజు కూడా ఇక్కడే పూర్తి చేసుకున్నారు. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే ప్రత్యేక హోదా కోసం జూలై 24వ తేదీన బంద్ నిర్వహించారు. ఆ సమయానికి పెద్దాపురంలో ఉన్న జగన్ పాదయాత్రకు విరామమిచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. జిల్లాలో ఊహించినదానికంటే అధికంగా పాదయాత్రకు జనాభిమానం వెల్లువెత్తడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టించింది.
భరోసా ఇచ్చారిలా.
♦ దారీతెన్నూ లేని, నాటు పడవలే దిక్కైన గోదావరి లంక వాసుల వ్యధను తెలుసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ప్రజల కష్టాలు విని, ఆయా గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.
♦ ఒక్కొక్కరికీ ఇంటి నిర్మాణానికి అయ్యే రూ.3 లక్షల రుణభారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ హామీ ఇచ్చారు.
♦ ప్రభుత్వోద్యోగులందరికీ ఇంటి స్థలమిచ్చి సొంతిళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
♦ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి సకాలంలో డీఏలు ఇస్తానన్నారు.
♦ దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు.
♦ కాకినాడ రూరల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, డీజిల్‌పై సబ్సిడీ పెంచుతానని, కొత్త బోట్లకూ రిజిస్ట్రేషన్ చేయిస్తానని, ఫిషింగ్ హాలిడే సమయంలో ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచుతామని, ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలు, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చారు.
♦ ఖాళీగా ఉన్న లక్షా 42 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు గ్రామ సచివాలయాల ద్వారా మరో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
♦ యానిమేటర్లకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తానని ప్రకటించారు.
♦ కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
♦ చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేలు ఇస్తామని, ఆప్కోలో మార్పులు తీసుకొచ్చి చేనేతకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని చెప్పారు.
♦ గతంలో భూములిచ్చి, తక్కువ పరిహారం పొందిన పోలవరం ముంపు బాధితులకు ఎకరాకు రూ.5 లక్షలు, గతంలో పరిహారం పొందనివారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. విలేకర్లందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ మైలురాళ్లు
♦ జూన్ 27న అమలాపురం నియోజకవర్గంలో 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
♦ మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
♦ తునిలో 2700 కిలోమీటర్ల మజిలీని అధిగమించింది.
జగన్‌కు భయపడే...
ప్రజా సంకల్ప యాత్రకు భయపడే రాష్ట్రం ప్రభుత్వం ఈ మాత్రమైనా పని చేస్తుంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి పాదయాత్ర ప్రారంభించేనాటికి ప్రభుత్వ పెద్దలు దోపిడీయే అజెండాగా పని చేసే వారు. జగన్ క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కడికక్కడ ప్రభుత్వ దోపిడీని ఎండగట్టడంతోపాటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాస్త ప్రభుత్వం తాయిలాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోంది. నిరంతర కష్టజీవి జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా ప్రతి పేద వాడికీ న్యాయం జరుగుతుంది.– షేక్ మహబూబ్ జానీ, టైలర్, బిక్కవోలు
ప్రజాసంకల్పయాత్ర వాయిదాపడడం బాధగా ఉంది
దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జగన్ త్వరగా కోలుకుని ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రభుత్వ పెద్దల అక్రమాలను బహిర్గతం చేసి పాలనలో సంక్షేమాన్ని గుర్తు చేసే నాయకుడిపై దాడి చాలా బాధాకరం. జగన్ వంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ప్రజా సంకల్పయాత్ర మళ్లీ ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నాను.– గొర్రిపోటి అరుణ, గృహిణి, పందలపాక
ఎన్ని ఆటుపోటులు వచ్చినా...
రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఎన్ని ఆటు పోటులు ఎదురైనా, తనపై హత్యాయత్నం జరిగిన గుండె ధైర్యంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజల పట్ల జగన్‌కు ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తున్నాయి. ప్రజల సమస్యలు తెలిసుకోవడానికి ఎండనక, వాననక కుటుంబాన్ని వదిలి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పాదయాత్ర చేయడం నాడు వైఎస్‌కు, నేడు జగన్‌కు మాత్రమే సాధ్యం. – పడాల నాగిరెడ్డి, రావులపాలెం.
Comments
Please login to add a commentAdd a comment