
సాక్షి, శ్రీకాకుళం: ప్రతి అడుగు.. ఓ భరోసాగా ప్రజల సమస్యలను వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 326వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్రకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం ఉదయం జననేత దుర్గమ్మ పేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 325వ రోజు ముగిసింది. బుధవారం ఉదయం కొబ్బరిచెట్లపేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి జార్జంగి, కొత్తపేట, కోటబొమ్మళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు బుధవారం 8 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,486.9 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు.