
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో భరోసా నింపుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరింది. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వైఎస్ జగన్ పెద్ద కొజ్జిరియా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లొద్దకుట్టి మీదుగా జననేత పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సూచకంగా ఏర్పాటు చేసిన విజయసంకల్ప స్తూపాన్ని జననేత ఆవిష్కరిస్తారు.
అక్కడి నుంచి తన తండ్రి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.