అయ్యప్ప సన్నిధిలోజననేత జగన్
సాక్షి, రాజమండ్రి :పవిత్ర గోదావరి తీరంలోని ప్రసిద్ధ శ్రీ ధర్మశాస్తా ఆధ్యాత్మిక కేంద్రాన్ని (అయ్యప్పస్వామి ఆలయం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి రోడ్ కం రైల్వే వంతెన మీదుగా రాజమండ్రి చేరుకున్న ఆయన సరస్వతి ఘాట్ (వీఐపీ ఘాట్) పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు.
శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని తలపించేలా రాతిశిలలతో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. డాక్టర్ ఎస్.చంద్రమౌళిస్వామి ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో జగన్‌మోహన్‌రెడ్డికి గులాబీలు, అక్షతలతో ఆశీర్వచనాలు పలికారు.
సంప్రదాయ తలపాగాలో..
స్వామివారి పట్టువస్త్రంతో చంద్రమౌళిస్వామి అలంకరించిన సంప్రదాయక తలపాగాలో జగన్‌మోహన్‌రెడ్డి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పూత పూసిన అయ్యప్పస్వామి పెండెంట్స్‌ను ఆయనకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వరుడు, సువర్చలాదేవి, ఆంజనేయస్వామి, వ్యాఘ్రేశ్వరుడు సుబ్ర హ్మణ్య స్వామివార్లను కూడా దర్శించుకున్న జగన్.. అయ్యప్ప 18 మెట్ల పీఠాన్ని దర్శించుకుని స్వయంగా దీపారాధన చేశారు. అనంతరం కొద్దిసేపు కూర్చున్నారు. ఆలయంలో నిత్యాన్నదానాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణం, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన రాజమండ్రికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో దివంగత జక్కంపూడి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ చైర్‌పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు.
యాత్రికులకు పలకరింపు
ఆలయానికి వచ్చిన పుష్కర యాత్రికులను జగన్ పలకరించారు. ప్రతి ఒక్కరినీ ఎక్కడ నుంచి వచ్చారు? పుష్కర స్నానం చేశారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని ఆరా తీశారు. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు జగన్‌ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రతి ఒక్కరూ కరచాలనం చేస్తూ సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. గర్భగుడిలో జగన్ సంప్రదాయబద్ధంగా పూజలు చేయడాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. భక్తులతోపాటు వేద పండితులు, ఆలయ సిబ్బంది కూడా జననేతను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆలయానికి వచ్చిన జగన్‌కు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు చల్లా శంకర్రావు, పోలసపల్లి హనుమంతరావు, కేశవరాజు స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిత్యాన్నదాన వంటశాలను పరిశీలించి క్యూలైన్‌లో నిలుచున్న భక్తులతో ముచ్చటించారు. గోదారమ్మకు చీర, పసుపు, కుంకుమ, పువ్వులు జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా జక్కంపూడి విజయలక్ష్మి సమర్పించారు.
సుమారు 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్, రాష్ర్ట కార్యదర్శులు జక్కం పూడి రాజా, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, యువజన విభాగం రాష్ర్ట కార్యదర్శి గుర్రం గౌతమ్, పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాష్ర్ట యువజన విభాగం కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, రాజమండ్రి నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి ఉన్నారు.