
ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతున్న ఐఏఎస్ అధికారి సిసోడియా
సాక్షి, అమరావతి : వివిధ ప్రభుత్వ శాఖల తీరు తెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సమీక్షలు పూర్తిగా స్నేహ పూర్వక వాతావరణంలో సాగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో సమీక్షల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు పట్ల అధికార వర్గాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అధికారులతో చర్చలు జరిపేటప్పుడు ఆ భావనను కాసేపు పక్కన పెట్టి సమాచారాన్ని రాబట్టడం, విశ్లేషించి అప్పటికప్పుడు సూచనలు చేయడం, వారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా వ్యవహరిస్తుండటం వారి హృదయాలను హత్తుకుంటోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు తమను జగన్ పదే పదే ‘అన్నా.. అన్నా..’ అని సంబోధిస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఒక ముఖ్యమంత్రి తమను అన్నా.. అని సంబోధించడం పట్ల వారు ముగ్ధులవుతున్నారు. ఆయా అంశాలను ఆకళింపు చేసుకోవడంలో కూడా జగన్ వేగం ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అనవసర ఉపోద్ఘాతం, సోది లేకుండా సూటిగా చెప్పదల్చుకున్న విషయాలను చెబుతుండటంతో అధికారులకు బాగా స్పష్టత వస్తోందంటున్నారు. సమీక్షా సమావేశాలు కూడా సమయానికే ప్రారంభమై నిర్ధిష్ట సమయానికే ముగుస్తున్నాయి. శనివారం నాటి సమీక్షలు సరిగ్గా 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభమై, కచ్చితంగా మధ్యాహ్న భోజన సమయానికి 12.55 గంటలకు ముగిశాయి. అంతకు ముందు రోజు కూడా ఇలాగే జరిగింది.
సీఎంను కలిసిన ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి
ప్రాధాన్యతల ప్రాతిపదికగా సమీక్షలు
ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ దృష్టి అంతా ఎన్నికల సమయంలో, అంతకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలనే అంశంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాతిపదికనే ఆయా శాఖల సమీక్షల ప్రాధాన్యతలను జగన్ ఎంచుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే స్కూళ్లల్లో చదువుకునే వాతావరణం కల్పిస్తే చిన్న పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి గట్టి పునాదులు పడతాయని భావించారు. ఇంజినీర్లు, డాక్టర్లు వంటి పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు బాగు పడతాయని కూడా జగన్ గట్టిగా విశ్వసించారు. ఇందులో భాగంగానే ‘అమ్మ ఒడి’ పథకం రూపకల్పన చేసినట్లు ప్రచార సభల్లో, ప్రజా సంకల్ప యాత్రలో జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి కాగానే ప్రాథమిక విద్యాశాఖపై తొలి సమీక్ష చేశారు.
కార్పొరేట్ బడులకు దీటుగా సర్కారు బడులు ఉండాలని సంకల్పించారు. రాష్ట్రంలోని 44 వేల పాఠశాలల్లో మౌలిక, ఇతర సౌకర్యాలపై శ్రద్ధ వహించాలని గట్టి ఆదేశాలిచ్చారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని, పరిశుభ్ర వాతావరణంలో వంట శాలలుండాలని, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణంలో శ్రద్ధ వహించాలని సూచించారు. ఆదాయ వనరుల అన్వేషణపై వైఎస్ జగన్ నిర్దిష్టమైన సూచనలు చేస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయంలో సైతం విలాసవంతమైన ఫర్నీచర్ వద్దని, సాధారణ, తక్కువ ఖరీదు చేసే ఫర్నీచర్‌నే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
శనివారం జగన్ షెడ్యూలు ఇలా సాగింది..
ఉదయం 9 గంటలకు : వ్యక్తిగత సిబ్బంది, అధికారులతో చర్చలు (కొందరు అధికారుల మర్యాదపూర్వక భేటీలు)
ఉదయం 11 గంటలకు : ఆర్థిక, ఆదాయ వనరులను సమకూర్చే శాఖలపై సుమారు రెండు గంటల పాటు సమీక్షలు
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం
మధ్యాహ్నం : 3.00 గంటలకు ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి పయనం (హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి)
మధ్యాహ్నం : 3.30 గంటలకు
హైదరాబాద్‌కు విమానంలో పయనం
సాయంత్రం : 5.00 గంటలకు
రాజ్‌భవన్‌కు చేరిక
సాయంత్రం : 6.30 గంటలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు ప్రముఖులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
రాత్రి 7.30 : హైదరాబాద్‌లోని
తన నివాసానికి చేరిక
నోట్ : ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడలోని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.