బందరు విచ్చేసిన మహానేత వైఎస్సార్‌తో మంత్రి పేర్ని నాని (ఫైల్)
వైఎస్సార్... ఈ పేరు వింటే చాలు.. పేదవాడి మోములో చిరునవ్వు కనిపిస్తుంది.. తమ ఆత్మబంధువును తలుచుకున్నంతగా మది పులకిస్తుంది. ఆయన దూరమై పదేళ్లు గడిచినా.. నేటికీ ప్రతి హృదీ, ప్రతి మదీ ఆ నిలువెత్తు రాజసాన్ని తలుచుకోకుండా ఉండలేదు.. ఆయన ప్రతి అడుగు బడుగుల ఉన్నతి వైపే.. జలయజ్ఞంతో అపర భగీరథుడిగా మారి, గంగమ్మను ఒడిసిపట్టి రైతన్నకు అందించాడు. ఒక పంటే ఎక్కువన్న చోటు మూడు పంటలు పండాయి.. అన్నదాతల లోగిళ్లు సిరులతో నిండాయి. ఆరోగ్యశ్రీతో గుండె గుండెల్లో దేవుడుగా మారారు..పేదల ఊహకైనా అందని కార్పొరేట్ హాస్పటల్స్‌ను వారి ముంగిటకే తెచ్చి మహానుభావుడయ్యారు. అన్నివర్గాల గుండెల్లో కొలువైన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై పదేళ్లు గడిచినా.. ఆ చెరగని చిరునవ్వు.. నిలువెత్తు రాజసం.. మాట ఇస్తే మడమతిప్పని నైజంతో ప్రతి గుండె గుడిలో నేటికీ కొలువైఉన్నాడు.. నేడు మహానేత వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
‘కృష్ణా’ అభివృద్ధికి తపించిన మహానేత
సాక్షి, అమరావతి బ్యూరో : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన సేవల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణా డెల్టాకు వరదలు వచ్చినప్పుడు జిల్లా రైతులు పడుతున్న కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణా డెల్టా ముంపునకు గురవుతోందని భావించి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు సర్ అర్ధర్ కాటన్ విగ్రహం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.06 లక్షల ఎకరాలు ఉండగా, రూ.4,573 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇందులో 40 శాతం పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 25 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది
1994 నుంచి బందరు పోర్టు డిమాండ్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినిపించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. తూర్పు కృష్ణా ప్రజలు దాదాపుగా 25 ఏళ్లుగా బందరు పోర్టు డిమాండ్‌తో ఉద్యమించారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాధ్యాసాధ్యాలను పరిశీలించి బందరు పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. 2008 ఏప్రిల్ 23వ తేదీ రూ.1,500 కోట్లతో పోర్టు ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. బందరు ప్రజల ఆందోళన ఫలితంగా మళ్లీ 2012 మే 12న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు 5,324 ఎకరాల భూమిని సేకరించేందుకు జీవో ఇచ్చింది. కానీ ఉత్తర్వులు అమలు కాలేదు.
ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో బందరు పోర్టు కోసం 28 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి పోర్టు నిర్మాణానికి 4,800 వేల ఎకరాలు సరిపోతుంది. కానీ వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి యత్నిస్తూ రైతుల జీవితాలతో టీడీపీ సర్కారు చెలగాటమాడటంపై రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దివి ఆపద్బాంధవుడు వైఎస్
అవనిగడ్డ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దివిసీమకు ఆపద్బాంధవునిగా చెప్పవచ్చు. కోట్లాది రూపాయల ఆధునికీకరణ పనులకు నియోజకవర్గంలోని పులిగడ్డలో శ్రీకారం చుట్టారు. అడగకుండానే విజయవాడ – పులిగడ్డ డబుల్‌లైన్ నిర్మాణం చేపట్టారు. భావదేవరపల్లిలో రాష్ట్రంలోనే తొలి మత్స్యకార పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. రూ.40కోట్లతో దివితీర ప్రాంత సముద్ర కరకట్ట అభివృద్ధి పనులతో పాటు వైఎస్ హయాంలో నియోజకవర్గంలో రూ.317.89 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టిన రాజశేఖరరెడ్డి దివిసీమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
నూజివీడు అభివృద్ధిలో ‘వైఎస్’ మార్కు
నూజివీడు: నూజివీడు అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మార్కు’ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో నూజివీడులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మూడుసార్లు పర్యటించారంటే, జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంతో వైఎస్‌కు ఉన్న అనుబంధానికి తార్కాణంగా నిలుస్తోంది. నూజివీడులో ‘వైఎస్ మార్కు’ అభివృద్ధిని ప్రతిపక్షాలు సైతం ఒప్పుకుంటాయి. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు కృషితో పాటు, ఆయనపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఎమ్మార్ అప్పారావు కాలనీని ఏర్పాటు చేసి నాలుగు వేలమందికి నివేశన స్థలాలే కాకుండా నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారు. పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించేందుకు అపర భగీరథుడిలా కృష్ణాజలాల ప్రాజెక్టును రూ.66 కోట్లతో మంజూరు చేశారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో సమీకృత వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్)ను ఏర్పాటుచేశారు.
ట్రిపుల్‌ఐటీతో మారిన నూజివీడు రూపురేఖలు
నూజివీడులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ఐటీని స్థాపించి పట్టణానికి దేశపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. వేలాది మంది పేదవర్గాల, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నతమైన సాంకేతిక విద్య లభిస్తోంది. ట్రిపుల్‌ఐటీలు నా మానసపుత్రికలని పలుమార్లు వైఎస్ చెప్పేవారు. సెప్టెంబర్ 29న, 2008న ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించేందుకు వైఎస్ ఇక్కడకు వచ్చారు. అరగంటకు పైగా విద్యార్థులతో గడిపారు. అదేవిధంగా నూజివీడు ప్రాంతంలో మామిడి పరిశోధనా స్థానం, ఉద్యానవనపంటల చీడపీడల నియంత్రణకేంద్రాన్ని రూ.12కోట్లతో ఏర్పాటు చేశారు.
పులిగడ్డలోనే ఆధునికీకరణ పనులకు అంకురార్పణ
2006లో ఓగ్ని తుపాను వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దివిసీమలో పర్యటించారు. 45 ఏళ్ల దివి చరిత్రలో అప్పడు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకూ కురిసిన వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డెల్టాను ఆధునీకీకరిస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.4,576 కోట్లతో డెల్టా ఆధునీకీకరణ పనులు చేపట్టారు. ఈ బృహత్తర పథకానికి 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద శంకుస్థాపన చేశారు. ఈ పనుల వల్ల జిల్లాలో రూ.2,180కోట్లు, నియోజకవర్గంలో రూ547.93 కోట్లు పనులు జరిగాయి. దీనివల్ల నియోజకవర్గంలో 13 భారీ వంతెనలు, యూటీలు ఏర్పడ్డాయి.
ఆరోగ్యశ్రీ మా ఆశాదీపాన్ని కాపాడింది
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా ఇంటి ఆశాదీపాన్ని కాపాడింది. మా కుమార్తెకు గుండెలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వైద్యులకు చూపిస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిరుద్యోగినైన నాకు అంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులమంతా బాధపడేవాళ్లం. అప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడం, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా పాపను కాపాడింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా పాపకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. మాలాంటి ఎన్నో కుటుంబాలకు వైఎస్ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వైఎస్‌కు మా కుటుంబ సభ్యులం ఎంతో రుణపడి ఉన్నాము.
– వై. రామకృష్ణ దంపతులు, మైలవరం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా ఇంటి ఆశాదీపాన్ని కాపాడింది. మా కుమార్తెకు గుండెలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వైద్యులకు చూపిస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిరుద్యోగినైన నాకు అంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులమంతా బాధపడేవాళ్లం. అప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడం, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా పాపను కాపాడింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా పాపకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. మాలాంటి ఎన్నో కుటుంబాలకు వైఎస్ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వైఎస్‌కు మా కుటుంబ సభ్యులం ఎంతో రుణపడి ఉన్నాము.
– వై. రామకృష్ణ దంపతులు, మైలవరం
మత్స్య పరిశ్రమలో సాంకేతిక విప్లవం తీసుకురావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఈ రంగంలో మంచి నిపుణులను తయారు చేయాలన్న సంకల్పంతో వైఎస్ దేశంలోనే తొలి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. 2007 సెప్టెంబర్ 7వ తేదీన అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఈ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయగా, అనంతరం భావదేవరపల్లిలో 8.58 ఎకరాల విస్తీర్ణంలో రూ.2కోట్లతో నిర్మించిన నూతన భవనాల్లోకి ఈ కళాశాలను మార్చారు. ఈ కళాశాల నుంచి వందలాది మంది మత్స్య నిపుణులు తయారయ్యారు.
ప్రాణభిక్ష పెట్టిన దేవుడు
కూలి పనులకు వెళితేనే పూటగడిచే నాకు గుండె సంబంధ వ్యాధి రావడంతో మా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైసా చేతిలో లేకుండా గుండె ఆపరేషన్ చేయించడమెలాగని మధనపడుతున్న సమయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాలు కాపాడింది. 2006లో విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో నేను శస్త్రచికిత్స చేయించుకుని, నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే ఇన్‌పేషెంటుగా ఉన్నాను. ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూర్తిస్థాయిలో భరించింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చేటపుడు మా ప్రయాణఖర్చులు కూడా అధికారులు చెల్లించారు.
రుణమాఫీతో అంతా హ్యాపీ
మహనీయుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రుణ మాఫీ పథకంతో నాకు ఒకేసారి పూర్తిగా రుణ మాఫీ జరిగింది. మైలవరం మండలం వెల్వడం గ్రామం భాస్కరనగర్‌లో నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు. 2004లో బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి వ్యవసాయానికి రుణం తీసుకున్నాను. వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది. ఆ రుణం ఎలా తీర్చాలా అని బాధపడేవాడిని, బంగారం స్టేట్ బ్యాంకులో పెట్టి రూ. 60వేలు రుణం తీసుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాను, ఆ ఏడాది పంటలు సరిగా పండక వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయాను. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా అని మథనపడేవాడిని. రాత్రిళ్లు నిద్ర కూడాపట్టేది కాదు. భగవంతుడిలా వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి కావడం తొలి సంతకం రుణ మాఫీ ఫైల్‌పై సంతకం చేయడంతో నా రుణం ఒక్కసారిగా మాఫీ జరిగింది. బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి రుణ మాఫీ జరిగిందని చెప్పిన తరువాత నాకు ఉపశమనం కలిగింది. మా కుటుంబం మొత్తం వైఎస్‌కు రుణపడి ఉన్నాం.
– అవులూరి ప్రతాపరెడ్డి, వెల్వడం, మైలవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment