* 19 నుంచి విజయవాడ కేంద్రంగా నిరశన
* నిరంకుశ విభజన నిర్ణయంపై సత్యాగ్రహం
* సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి
* ఓట్లు, సీట్ల కోసం విభజన నిర్ణయం కాంగ్రెస్ నిరంకుశ వైఖరే
* పది సీట్ల కోసం ఏకపక్షంగా విభజనపై ముందుకెళుతోంది
* విభజన నిర్ణయానికి ప్రాతిపదిక, హేతుబద్ధత ఏమీ లేదు
* శ్రీకృష్ణ నివేదికపై కనీసం చర్చించిన పాపాన కూడా పోలేదు
* సాగునీటి సమస్యలకు పరిష్కార మార్గాలూ చెప్పటం లేదు
* కృష్ణా డెల్టా భవితవ్యం అంధకారంగా మారే ప్రమాదం
* పరిష్కారం లేకుండా విభజిస్తే కళ్ల ముందే నీటి యుద్ధాలు
* కాంగ్రెస్, టీడీపీ నేతలది అంతా డ్రామానే: మైసూరా
సాక్షి, హైదరాబాద్: అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకుండా.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 19వ తేదీ నుంచి విజయవాడ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ‘‘సమ న్యాయం చేయలేనపుడు, అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించలేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి’’ అని డిమాండ్ చేస్తూ ఆమె ఈ దీక్ష చేపడుతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ప్రకటించారు.
బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా, చర్చలు, సంప్రదింపులు జరపకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న దరిమిలా ఉత్పన్నమైన పరిణామాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మైసూరారెడ్డి పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి రాజేష్‌కుమార్, ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పది సీట్ల ఆశతోనే విభజన...
అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కారం చేయాలని కోరుతున్నా ఇప్పటి వరకూ కేంద్రం ఆ దిశలో పయనించటం లేదని మైసూరా విమర్శించారు. వారి వైఖరి చూస్తుంటే ఏకపక్షంగా నిరంకుశంగా, రాజకీయ లబ్ధి కోసమే వారికి తోచిన విధంగా రాష్ట్రాన్ని విభజించాలనే కుట్ర చేస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు నిరసనగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 19 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నారని తెలిపారు.
‘‘కాంగ్రెస్ నిర్ణయం ఏ కోణంలో చూసినా పది సీట్ల ఆశతోనే విభజన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.. ఓట్లు, సీట్లు అన్న ఆలోచన మినహా.. ఒక ప్రాతిపదిక, ఒక హేతుబద్ధత ఏదీ లేకుండా విభజనపై ముందుకెళుతున్నారు’’ అని మైసూరా మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై కనీసం చర్చించిన పాపాన కూడా పోలేదని.. కేవలం రాజకీయ దృష్టితోనే ప్రభుత్వం విభజనకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కమిటీ వద్దకు ఇతర పార్టీలు ఎలా వెళతాయి?
‘‘ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మాత్రమే. అలాంటి కమిటీ ముందుకు ఇతర పార్టీల వారు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఈ అంశంలో ఇమిడి ఉన్న భాగస్వాములు ఎలా వెళతారు?’’ అని మైసూరా సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ ఆంటోనీ కమిటీ ముందుకు వెళ్లే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ కమిటీని కలవాలంటే ముందు పీసీసీ అధ్యక్షుడిని సంప్రదించాలట..! ఆయన్ను అడుక్కోవాల్సిన ఖర్మ ఎవరికి పట్టింది?’’ అని విమర్శించారు.
ఈ వ్యవహారాలన్నీ చూస్తూంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందనేది తేటతెల్లమవుతోందన్నారు. ‘‘రాజధాని విషయంలో రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురవుతాయి.. ఒకే ప్రాంతంలో రెండు రాజధానులు ఎలా ఇముడుతాయి? ఒక చోట నుంచి మరో ప్రాంతాన్ని ఎలా పరిపాలించుకుంటారనే ఇంగిత జ్ఞానమైనా లేకుండా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారు.. అసలు వీళ్లు దేశాన్ని పాలించే నాయకులా? లేక ఏదైనా గ్రామ నాయకులా? అర్థం కావడం లేదు’’ అంటూ మండిపడ్డారు.
కళ్ల ముందే నీటియుద్ధాలు చూస్తాం...
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు నిర్మించిన జలాశయాల విషయం, సాగునీటి సమస్యల గురించి కూడా వారు ఆలోచించటం లేదని, వాటికి పరిష్కార మార్గాలు కూడా చెప్పటం లేదు అని మైసూరారెడ్డి తప్పుపట్టారు. ‘‘సాగునీటి పంపిణీ అనేది చాలా జటిలమైన సమస్య. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించుకున్నాం. సాగునీటిపై స్పష్టత లేకుండా విభజిస్తే.. కృష్ణా జలాలపై ఆధారపడిన కృష్ణా డెల్టా ఆయకట్టు భవితవ్యం అంధకారమవుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘కృష్ణా డెల్టా రైతాంగం ఇపుడు 181 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. శ్రీశైలం నుంచి 20 టీఎంసీలు భీమా ప్రాజెక్టుకు కేటాయించటం వల్ల ఇపుడు అది 161 టీఎంసీలకు తగ్గింది. ఇదికాక మరో 40 టీఎంసీల నీరు అదనంగా కృష్ణా డెల్టా రైతులకు వెళుతోంది. విభజన జరిగి ట్రిబ్యునల్, బోర్డు వస్తే అక్కడి రైతాంగం తన్నుకు చావాల్సిందే.. కళ్ల ముందే నీటియుద్ధాలు చూస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను వేటినీ చూడకుండా, ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు...
ఒక తండ్రిగా అందరికీ సమన్యాయం చేయాలనీ, ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని తాము కోరుతుంటే.. తుపాకీ నెత్తికి గురిపెట్టి విభజన కు అంగీకరించాల్సిందేనని హుకుం జారీచేయటం సరికాదని మైసూరా తప్పుపట్టారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కారం చేయలేకపోతే ఈ రాష్ట్రాన్ని యథాతధంగా వదలివేయండని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. అందుకే విజయమ్మ ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా ఒక డ్రామా
అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటమన్నది ఒక డ్రామా తప్ప మరొకటి కాదని మైసూరా ఎండగట్టారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీలో సమావేశమై ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని పేర్కొని గవర్నర్‌కు సమాచారం ఇవ్వొచ్చని.. లేదా నేరుగా గవర్నర్‌ను కలుసుకుని తమకు ప్రభుత్వంపై విశ్వాసం లేదని లేఖ ఇచ్చినా ప్రభుత్వం పడిపోతుందని ఆయన పేర్కొన్నారు. నిజంగా అలా జరిగి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. అవేమీ చేయకుండా పార్లమెంటులో భద్రతా నిబంధనలు అతిక్రమించి గాంధీ బొమ్మ వద్ద ధర్నా చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
విభజనకు లేఖ ఇచ్చి.. పార్లమెంటులో డ్రామా...
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఒకవైపు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. మరోవైపు తన ఎంపీలతో పార్లమెంటును స్తంభింప చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని చెప్పవచ్చని ఆయన సూచించారు. దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కాకుండా ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలను, ఎంపీలను బెదిరిస్తూ మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.
అసెంబ్లీలో తీర్మానం అంశంపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై మైసూరా స్పందిస్తూ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనే స్వయంగా ఛత్తీస్‌గఢ్ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేయించి పంపిన విషయం మరిచారేమో అని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తో నిమిత్తం లేకుండా అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించవచ్చని చెప్పారు. మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటూ తీర్మానం చేసి పంపిన విషయాన్ని కూడా మైసూరా గుర్తుచేశారు. బహుశా దిగ్విజయ్‌కు మతిమరుపు ఎక్కువైందేమోనని, ఆయనకు మెదడు చెడిపోయినట్లుందని మండిపడ్డారు.