‘విజయ’ దీక్ష
ఎన్నో చారిత్రక ఉద్యమాలకు వేదికగా నిలిచిన బెజవాడ గడ్డ మరోసారి వార్తల్లోకెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై ఇప్పటికే సీమాంధ్ర అట్టుడుకుతోంది. ఆపై ఉద్యోగులు కూడా నగరం నుంచే సమ్మె శంఖం పూరించి సోమవారం అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించిన సంగతి విదితమే. తాజాగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం 19వ తేదీ నుంచి ఇక్కడే ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు బుధవారం ప్రకటించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్నట్లు వైఎస్సార్ సీపీ మొదటినుంచి విమర్శిస్తోంది. రాష్ట్రాన్ని సమన్యాయంతో విభజన చేయాలని, లేనిపక్షంలో యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తోంది. విభజనకు టీడీపీతో కలిసి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్రం నుంచి స్పందన లభించకపోవడంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు తమ పదవులకు రాజీనామా చేసి ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలోనే జనంకోసం వైఎస్ కుటుంబం విజయవాడ వేదికగా ‘సమరదీక్ష’కు శ్రీకారం చుట్టబోతున్నారు. రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాల్లో అణువణువునా చైతన్యాన్ని నింపుకొన్న కృష్ణా జిల్లాలో పీడిత, తాడిత జనవిముక్తి కోసం అనేక చారిత్రక పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్ర ఉద్యమంలోను ఈ జిల్లా కీలక భూమిక పోషించింది. జిల్లాకు కేంద్రబిందువైన విజయవాడ అనేక ఉద్యమాలకు వేదికగా నిలిచింది. ఆ స్ఫూర్తితో వైఎస్ కుటుంబం ఇక్కడినుంచి అనేక దీక్షలు చేపట్టింది.
కృష్ణానుంచే జగన్ పోరుబాట...
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల తీరును నిరసిస్తూ, రైతుల మేలు కోరుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో రెండున్నరేళ్ల క్రితం మూడు రోజలపాటు లక్ష్యదీక్షను నిర్వహించారు. అప్పట్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జిల్లాలో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి బందరులో జరిగిన సభలో మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే లక్ష్యదీక్ష చేస్తానని ప్రకటించారు. 2010 డిసెంబర్ 22 ఆయన పుట్టినరోజునాడు విజయవాడ కృష్టాతీరంలో లక్ష్యదీక్షకు శ్రీకారం చుట్టి 23, 24వ తేదీల్లోనూ కొనసాగించారు. ఆ మూడు రోజులు ఆ ప్రాంతం జనసంద్రమైంది. ఆ తర్వాత జిల్లాలో ఓదార్పుయాత్ర ముగింపు సందర్భంగా రైతుల కోసం 2011 అక్టోబర్ 1న విజయవాడ సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద వైఎస్ జగన్ రైతుదీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, పంటలు కోల్పోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని, సాగునీరు సక్రమంగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కుమ్మక్కు కుట్రలు పన్నినా...
జగన్‌మోహన్‌రెడ్డిని జనానికి దూరం చేయాలన్న కుమ్మక్కు కుట్రలతో కాంగ్రెస్, టీడీపీలు సీబీఐతో కేసులు పెట్టించి అరెస్టు చేయించినప్పటికీ జనం కోసం వైఎస్ కుటుంబం దీక్షలు ఆగలేదు. భర్తను కోల్పోయినా, కొడుకు జైలులో ఉన్నా... బాధను దిగమింగుకుంటూ విజయమ్మ జనం కోసం పోరాడుతున్నారు. ప్రజలపై కరెంటు చార్జీల భారం తగ్గించాలని, సర్‌చార్జీల మోత ఉప సంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయమ్మ బెజవాడలోనే 2012 జూలై 17న కరెంటు దీక్ష చేశారు. ఇటీవల ఇక్కడే ప్రాంతీయ సదస్సును నిర్వహించిన విజయమ్మ స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన మరోప్రజాప్రస్థానం పాదయాత్రను సైతం ప్రజలు ఆదరించి ఆమెను అనుసరించారు. ఇలా వైఎస్ కుటుంబసభ్యులు ప్రజల కోసం, ప్రజల మధ్య, చారిత్రక పోరాటాలకు తమదైన శైలిలో నాయకత్వం వహిస్తునే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై విజయమ్మ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి ఈ నెల 19న విజయవాడలో ఆమరణదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.
తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆమె చేపట్టబోయే ఆమరణ దీక్షకు మద్దతు పలికేందుకు జిల్లావాసులు ఉవిళ్ళూరుతున్నారు.