‘‘కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేశ్ కమిటీ ఇచ్చిన తీర్పు కృష్ణా పరీవాహక ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తోంది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘‘కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేశ్ కమిటీ ఇచ్చిన తీర్పు కృష్ణా పరీవాహక ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తోంది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కృష్ణానదిపై ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యి ఉంటే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. పులిచింతల ముంపు బాధితులను, నల్లగొండ రైతాంగాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో జరగనున్న నష్టాన్ని వివరించడం, తీర్పు గెజిట్ వెలువడకుండా నిలవరించేలా ఒత్తిడి పెంచేందుకు వైఎస్ విజయమ్మ బుధవారం పులిచింతల ప్రాజెక్టుపై నీటిదీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ దీక్షకు తరలివచ్చారు.
దీక్షలో విజయమ్మ మాట్లాడుతూ తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు వల్లే ఈ విపత్కర పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టుకు శత్రువు చంద్రబాబే అని చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందు, ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పునరావాసం అందించకుండానే ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హడావుడి పడిపోతున్నారని, ఇదంతా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనని ఆమె పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్‌పై
విరుచుకుపడిన వక్తలు
నీటిదీక్షలో పాల్గొన్న పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. రైతుల గురించి, వారి బాగోగుల గురించి ఆలోచించని నేతలు, అదే రైతుల పక్షాన పోరాడేందుకు వచ్చే నాయకులకు అడ్డంకులు మాత్రం సృష్టిస్తారని విమర్శించారు. పులిచింతలకు వచ్చే సమయంలో మంత్రి పోలీసులతో తనిఖీలు చేయించారని, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చర్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, పదవి నాలుగు నెలల ముచ్చటే అని వ్యాఖ్యానించారు. జిల్లా నేతలు సైతం మంత్రి తీరుపై మండి పడ్డారు. ‘పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం చేయలేరు. మంత్రి ఉత్తమ్ ఎందుకు ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. పులిచింతలకు వస్తుంటే పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేశారు..’ అని వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగ కన్వీనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం పరి శీల కుడు గున్నం నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, కోదాడ కో ఆర్డినేటర్ ఎర్నేని వెంకటరత్నం (బాబు), తుంగతుర్తి కో ఆర్డినేటర్ ఇరుగు వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీకళారెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.