చంద్రబాబును కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
అనంతపురం: అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైవీ విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా కలిశారు. ఈ సందర్భంగా వారు అనంతపురానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... చంద్రబాబును కోరారు. కాగా నాయుడి జిల్లా పర్యటన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఎక్కడా ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా నిర్ణయించుకున్న విధంగా చెప్పాల్సింది చెప్పారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని, ప్రజలు సహకరించాలని ప్రతి చోటా చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయం పడుతుందని, ఓపికతో ఉండాలని కోరారు.
‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా.. రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగిలాయి. వనరులు కూడా కొద్దిగానే ఉన్నాయి. ఉన్నవాటిని ఉపయోగించుకుని అన్ని హామీలనూ ఒకొక్కటిగా నెరవేరుస్తా. నేను ఒక్కటే చెబుతున్నాను. నాకు మీ సహకారం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు.