
జీపు విలువ మనిషికుండదా?
*గిద్దలూరు ఘటనపై డీజీపీని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే
*అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదు
*స్థానిక ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడులకు పాల్పడుతోందని వెల్లడి
*డీజీపీ న్యాయం చేస్తామన్నారు: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
హైదరాబాద్: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్ఐ దురుసు ప్రవర్తన కారణంగా తమ పార్టీకి చెందిన సహకార సంఘ అధ్యక్షుడు మరణించిన తరువాత కూడా తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుక్రవారం డీజీపీ రాముడును కలిసి సంఘటన వాస్తవాలను వివరించారు.
గిద్దలూరులో గత నెల 30వ తేదీన సహకార సంఘ అధ్యక్షుడు వై.భాస్కరరెడ్డి మృతికి కారణమైన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డీజీపీని కోరారు. అపార్టుమెంట్‌లో ఏర్పడిన పార్కింగ్ వివాదంలో అక్కడి ఎస్సై ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకొని ఒకరి పక్షాన వత్తాసు తీసుకొని గొడవకు కారణమయ్యారని వివరించారు.
జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన భాస్కరరెడ్డి పట్ల ఆ ఎస్సై దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆయన పోలీసు స్టేషన్‌లోనే కుప్పకూలి మరణించారని తెలిపారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భాస్కరరెడ్డి మరణిస్తే.. తెల్లవారు 3.30 గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో పోలీసు జీపు దగ్ధం కావడం కారణం చూపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు.
పోలీసు జీపు దగ్ధం వంటి ఆవేశపూరిత ఘటనలు అంత ఆలస్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసే అవకాశం ఉండదని డీజీపీకి వివరించారు. పోలీసు విచారణలో జీపు కాల్చిన వారెవరిపైనా చర్యలు తీసుకోండిగానీ.. దాన్ని సాకుగా చూపి తమపై అక్రమ కేసులు బనాయించవద్దని విజ్ఞప్తి చేశారు. గిద్దలూరు సంఘటనలపై పోలీసుల విచారణ తీరు చూస్తే, పోలీసు జీపు దగ్ధమైన ఘటనకు ఇచ్చిన విలువ వ్యక్తి చనిపోయినదానికి ఇవ్వడం లేదని తెలిపారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరాం : వైవీ సుబ్బారెడ్డి
గత నెలలో కనిగిరి టీడీపీ నేతల దాడిలో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ నేత మరణించడం, గిద్దలూరులో పోలీసు స్టేషన్‌లో జరిగిన గలాటలో మరో పార్టీ నేత మరణించిన విషయాలను డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భేటీ అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
డీజీపీ న్యాయం చేస్తామన్నారు : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు సంఘటనలో తమకు న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చెప్పారు. డీజీపీతో భేటీ అనంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సై ఉద్దేశ పూర్వకంగా ఒక పక్షాన అండగా నిలిచి రెండో పక్షానికి చెందిన వారిలో మహిళలతో సహా అందరి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని అన్నారు.