బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి
పయ్యావుల విమర్శపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం
విభజన విషయం లో చంద్రబాబు నాయుడు వైఖరితో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి అన్నారు. అలాంటి పార్టీ ఆలోచనలను వైఎస్సార్ సీపీ కాపీ కొడుతోందంటూ పయ్యావుల కేశవ్ విమర్శించడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా వారు శని వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభివర్ణించారు. టీడీపీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని వారన్నారు. తెలంగాణ ప్రకటన తరువాత సీమాంధ్రకు ప్యాకేజీ కోరిన బాబు, వైఎస్సార్ సీపీ సమైక్యవాదాన్ని చూసి ఇపుడు సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
టీడీపీ ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు సమైక్యవాదంతో రెండు కాపురాలు చేస్తోందని, దీనిని సీత, సావిత్రి కాపురం అనాలో, లేక చింతామణి కాపురం అనాలో పయ్యావుల వివరించాలన్నారు. బాబును మించిన రాజకీయ చింతామణి ఎవరు?ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఎన్టీఆర్ పంచన చేరి, గుంట నక్కలా కాచుకుని అదను చూసి ఆయనను దెబ్బకొట్టి పార్టీనే లాగేసుకున్న వైనాన్ని ఎవరు మర్చిపోగలరు? అని ప్రశ్నించారు. బాబు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు భరించలేక ఒక దశలో వైఎస్సార్‌సీపీలో చేరాలని రాయబారాలు నడపడం అబద్ధమా? ఈ విషయం బయటకు పొక్కేసరికి, మీడియా ముందు వలవలా ఏడ్చేసిన పయ్యావుల ఇపుడు తమ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు.