
ఇలాగైతే ఎలా బాబూ..
సాక్షి, కడప : ఎన్నికల సందర్భంగా రుణ మాఫీ చేస్తాం.... ఎవరూ పంట రుణాలు చెల్లించొద్దంటూ ప్రతి సభలో ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఊరకుండిపోతున్నారు. ఒక పక్క రుణాలకు సంబంధించి గడువులు దాటుతున్నా ఇంతవరకు మాఫీపై మాటలేగానీ చేతలు చూపించని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రైతన్నలు గుర్రుగా ఉన్నారు.
ఈరోజు చేస్తాం...రేపు చేస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప ఇప్పటివరకు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు బాబు ఇవ్వకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీషెడ్యూల్డ్‌కు సంబంధించి ఆర్‌బీఐ ఇచ్చిన నివేదికలో వైఎస్సార్ జిల్లా గల్లంతు కావడం రైతన్నలను కుంగదీస్తోంది. ఎక్కడికి వెళ్లినా తెలుగు తమ్ముళ్లకు అటు అన్నదాతల నుంచి, ఇటు డ్వాక్రా మహిళల నుంచి శృంగభంగం తప్పడం లేదు.
రీ షెడ్యూల్ జాబితాలో కనిపించని వైఎస్సార్ జిల్లా
ఒక పక్క పాత బకాయిలు కట్టండి...కొత్త అప్పులు తీసుకోండంటూ బ్యాంకర్ల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపధ్యంలో చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ ఇంతవరకు ముందుకు సాగకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. రుణమాఫీపై ఇంతవరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో రైతన్నలు పాత రుణాలు చెల్లించాలో, చెల్లించకూడదో తెలియక అవస్థలు పడుతున్నారు. మరోపక్క తాజాగా ఆర్‌బీఐ ప్రకటించిన జాబితాలో వైఎస్సార్ జిల్లా పేరు లేకపోవడంతో రైతన్నలు రుణమాఫీ లభించదని ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
రీషెడ్యూల్ చేస్తారని ఇంతవరకు రైతన్నలు నమ్ముతూ వచ్చినా తీరా ఆర్‌బీఐ కూడా వైఎస్సార్ జిల్లా పేరు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైఎస్సార్ జిల్లాలో క్రాప్ లోన్లకు సంబంధించి అన్ని బ్యాంకుల్లో 3,32,105 మంది రైతులు రూ. 2103.21 కోట్లు తీసుకోగా, బంగారు రుణాల కింద 2,18,408 మంది రైతులు రూ. 2124.43 కోట్లు, టర్మ్ రుణాలను 69,921 మంది రైతులు రూ. 754.89 కోట్లను తీసుకున్నారు. ఇంతవరకు బ్యాంకులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు.
వైఎస్సార్ జిల్లాలో కరువు మండలాలు పదహారే
ఒకవేళ రుణమాఫీకి సంబంధించి ఆర్‌బీఐ కరువు మండలాలకు వర్తింపజేస్తూ జాబితాలో చేర్చి ఉన్నా కేవలం 16 మండలాలకు మాత్రమే వర్తించేది. ఎందుకంటే వైఎస్సార్ జిల్లాలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు ఉన్నవి పదహారు మండలాలేనని ఇప్పటికే ఇటు బ్యాంకులతోపాటు అటు వ్యవసాయశాఖ అధికారులు నివేదిక సమర్పించినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని 35 మండలాలతోపాటు 16 మండలాల్లోని రైతులుకూడా ఆర్‌బీఐ ప్రకటించిన రీ షెడ్యూల్ జాబితాలో లేదని స్పష్టంగా తెలిసిపోయింది.
ఏది ఏమైనా అటు ఆర్‌బీఐ, ఇటు టీడీపీ ప్రభుత్వం రైతుల రుణాలకు సంబంధించి ఎటూ తేల్చకుండా నాన పెడుతుండడంతో అన్నదాత సాగుకు పడరాని కష్టాలు పడుతున్నాడు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అంతా చుక్క చినుకు పడక సాగు ముందుకు సాగకపోవడంతో రబీపై అన్నదాతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిస్తే బ్యాంకు ద్వారా రుణాలను తీసుకుని కనీసం రబీలోనైనా పంటలను సాగు చేసేందుకు సిద్ధమవ్వాలని ఆలోచిస్తున్నాడు. అయితే, ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడక పోవడంతో కర్షకుడు మళ్లీ ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించి పెట్టుబడికి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.