
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల మహిళలకు ఆపన్నహస్తం అందించడానికి సిద్ధమైంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలను అందించనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
లబ్ధిదారుల ఎంపిక కోసం సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలు..
- ఒక్కో కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉండాలి.
- కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పదెకరాల్లోపు మెట్ట భూమి ఉండొచ్చు.
- కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించి ఉండకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో 750 చ. అడుగుల్లోపు నిర్మిత భవనం ఉన్నా అర్హులే.
- 45–60 ఏళ్లలోపు వయసు ఉన్నట్లు ధ్రువీకరించే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్ గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ కార్డు గానీ ఉండాలి.
- కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.
- కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు. పారిశుధ్య ఉద్యోగులు ఉంటే అర్హులే.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
వైఎస్సార్ కాపు నేస్తం కింద లబ్ధిదారులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వలంటీర్లు.. పట్టణ ప్రాంతాల్లో వార్డు వలంటీర్లు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. లబ్ధిదారు, కుటుంబ పెద్ద ఆధార్ నంబర్లు, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఆదాయం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment