కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి, విజయవాడ/ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆయన కార్యాలయం కార్యకర్తలతో నిండిపోయింది. ఎండ మండుతున్నా ఆయనతోపాటు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నడిచారు.
బెంజిసర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు, మదర్ థెరిస్సా విగ్రహం జంక్షన్, సిద్ధార్థ కళాశాల, మొగల్రాజపురం, పుష్పాహోటల్, రెడ్‌సర్కిల్, గోపాలరెడ్డి రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయూనికి ర్యాలీగా వచ్చారు. అనంతరం కోనేరు నాలుగు సెట్ల నామిషన్లను దాఖలు చేశారు.
తొలుత బెంజిసర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, తూర్పు, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల అభ్యర్థులు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతమ్‌రెడ్డి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమవుతా : కోనేరు
ప్రజలతో మమేకమై విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోనేరు రాజేంద్రప్రసాద్ అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై అపార నమ్మకంతో విజయవాడ ఎంపీ సీటును కేటారుుంచారని పేర్కొన్నారు. ఆయన నమ్మకానిన నిలబెట్టుకుంటానన్నారు.
భగవంతుని ఆశీస్సులు, తన కుటుంబ సభ్యుల సహకారంతో స్వతహాగా కొన్ని ప్రణాళికలు, మరికొన్ని ప్రభుత్వపరంగా చేపట్టి అభివృద్ధి చేస్తాన్నారు. గతంలో కొందరు నాయకులు చెప్పిన విధంగా రాత్రికి రాత్రే నగరాన్ని వెనీస్ గానో, సింగపూర్ గానో మారుస్తానని తాను చెప్పనని, ఇప్పుడున్న దీనస్థితి నుంచి ముందుకు తీసుకువెళతానని పేర్కొన్నారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తానని, ఎక్కడా మురుగు నీరు నిలువకుండా ప్రణాళికను అమలు చేస్తామన్నారు. మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు అందించేందుకు కృషిచేస్తానన్నారు.
నగరంలోనే ఉంటా..
ఎట్టిపరిస్థితిలోను నియోజకవర్గాన్ని విడిచి వెళ్లనని, విజయవాడ వాసిగానే ఉంటానని మీడియూ ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు కోనేరు సమాధానమిచ్చారు. నగరం గురించి తనకు అంతా తెలుసని, కొందరు నాయకుల మాదిరిగా ఒక రోజు ఇక్కడ మిగిలిన 364 రోజులు వేరే ప్రాంతాల్లో ఉండనని ఆయన ప్రకటించారు.
రాజధానిగా విజయవాడ చేస్తారా.. అని ప్రశ్నించగా.. ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతమని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రం విడిపోదని చెప్పిన వారే నేడు రాజధాని కావాలని, ప్యాకేజీలు కావాలని తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. కేవలం రాజధానే ముఖ్యం కాదని, అంకితభావం చిత్తశుద్ధితోనే అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.