జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం
జి.కొండూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. పార్టీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌తో కలిసి ఆయన మండలంలోని కోడూరు, చిననందిగామ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోనేరు, జోగి రమేష్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎక్కడికక్కడ మహిళలు వారికి విజయ తిలకాలు దిద్దారు. అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో కోనేరు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో కొనసాగాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
ఆయన ప్రతినిధులుగా పోటీచేస్తున్న తమకు మద్దతు తెలిపి, ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక ప్రతిపక్షాలు తన పేరుగల ఇద్దరితో ఎంపీ అభ్యర్థులుగా పోటీలో నిలిపాయని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జోగి రమేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత భూములకు సాగు నీటి సరఫరా, కాలువలకు మరమ్మతులు, అంతర్గత రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేసే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. చిననందిగామ, కోడూరు గ్రామాల్లో ప్రజల తె లిపిన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థి వేములకొండ సాంబయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి కాజా బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ పులిపాక థామస్, నాయకులు లీలా శ్రీనివాస్, పామర్తి శ్రీనివాసరావు, మాజీ సర్పంచి వీరంకి వెంకట నరసింహారావు, శ్రీమన్నారాయణరెడ్డి, పసుపులేటి రమేష్, మన్నే రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు.