కడప : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ)లో భూ నిర్వాసితుల కోసం కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి మంగళవారం దీక్షలు చేపట్టారు. ఆర్టీపీపీ, భూములు కోల్పోయిన రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో భూ నిర్వాసితులు రిలే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతు పలికారు.
యాజమాన్యం దిగి రాకపోవటంతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే ఏపీ జెన్కో ఎండీ, డైరెక్టర్లతో మాట్లాడినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. భూ నిర్వాసితుల డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయన్నారు.