ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరసన
దాచేపల్లిలో ర్యాలీ ప్రారంభం కాకముందే అడ్డుకున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై దౌర్జన్యం
ఈడ్చి ఆటోలో పడేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన వైనం
అడ్డుపడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జి
పోలీస్‌స్టేషన్‌లో ధర్నా చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన జంగా
సాక్షి, గుంటూరు: జిల్లాలో పోలీసుల దౌర్జన్యాలకు అడ్డ్డు అదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల ఆదేశాలను శిరసావహిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆజ్ఞను శిరసావహిస్తూ ఆయన అక్రమాలను సహకరించడంతో పాటు, వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేసే వారిపైనే తప్పుడు కేసులు పెడుతూ లాఠీలతో జులుం ప్రదర్శిస్తున్నారు. తమకేం జరిగినా ఆయన చూసుకుంటాడనే ధైర్యంతో పోలీసులు పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యాలకు, దాడులకు దిగుతున్న వారికి సహకరిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలపై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇక్కడి పోలీసులు మరింతగా రెచ్చిపోతూ వైఎస్సార్‌సీపీ నాయకులను అణచి వేస్తూ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై కేసులు బనాయించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాల్సిందిపోయి, క్వారీ వైపు ఎవరూ వెళ్లకుండా కాపలా కాయడం పోలీసుల దిగజారుడు స్థాయిని తెలియజేస్తోంది.
తాజాగా బుధవారం దాచేపల్లిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి దిగి లాఠీలతో జులుం ప్రదర్శించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్, ఇసుక దందా, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించాలని భావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నారాయణపురంలోని ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి నల్ల జెండాలతో నిరసన ర్యాలీ ప్రారంభించారు.
ర్యాలీ మొదలు కాకముందే బంగ్లా వద్ద గురజాల రూరల్ సీఐ అళహరి శ్రీనివాసరావు, దాచేపల్లి, కారంపూడి ఎస్‌ఐలు కిరణ్, నారాయణస్వామి ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డు తగిలి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని జంగా చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. వారిని విడిపించుకుని రోడ్డుపైకి ర్యాలీ చేసుకుంటూ వెళుతున్న జంగాను దౌర్జన్యంగా లాగి ఆటోలో పడేసి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న జంగాను వదిలిపెట్టాలంటూ నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
జంగాను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా జంగా స్టేషన్ ఆవరణలో బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సమయంలో జంగా తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. తనపై, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్య కాండకు జంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయంత్రానికి స్టేషన్ నుంచి సొంత పూచీకత్తుపై బయటకు వచ్చిన జంగా ఎమ్మెల్యే, పోలీసుల తీరుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు.