సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని అనంతపురం పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన ఇద్దరు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో పాటు 15 మందితో కూడిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన శివప్రసాదరెడ్డి హత్యానంతరం ఆ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో గుర్నాథరెడ్డి నిందితుడని పోలీసులు చెప్పారు. దాదాపు నాలుగు వాహనాల్లో వచ్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి అనంతపురం తరలించారు. ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు శనివారం 30 మంది వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని న్యాయస్థానంలో హాజరుపరుస్తూ రూపొందించిన రిమాండ్ కేసు డైరీలో, అంతకు ముందే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనూ గుర్నాథరెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. ఆయన అరెస్టును అర్ధరాత్రి దాటిన తరవాత అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.
అరెస్టులపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
హత్య అనంతర ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలను బాధ్యుల్ని చేసి అరెస్టు చేయడం దారుణం. శాంతిభద్రతలను అదుపుచేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
- అనంత వెంకట్రామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి