
సాక్షి, తిరుపతి: ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. గతంలో వెయ్యి పింఛను ఇవ్వడానికే అష్టకష్టాలు పడ్డ చంద్రబాబు ఎన్నికలు ఉన్నందునే ఇప్పుడు రెండవేలు ఇస్తున్నారని అన్నారు. పథకాలను అరకొరగా అమలు చేసి టీడీపీకే ఓటు వెయ్యాలని ప్రమాణం చేయిస్తున్నారంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
సీఎం పదవిని చంద్రబాబు వ్యాపారంగా మార్చివేశారని, పసుపు కుంకుమలను తుడిచే విధంగా పాలన చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రజలకు నీళ్లు మాత్రం ఇవ్వలేకపోరని.. మద్యం మాత్రం ఆర్డర్ వేస్తే వచ్చేస్తోందని చెప్పారు. పసుపు కుంకుమకి పదివేలు ఇస్తామని చెప్పి.. మూడువేలు చెక్కులు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధాని మోదీతో సహా, చంద్రబాబు, పవన్ కళ్యాన్ చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు.
ప్యాకేజీ కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, వైఎస్ జగన్ కారణంగా హోదా పోరాటం ఇంకా కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజంగా హోదాపై చిత్తశుద్ధి ఉంటే మోదీ ఎదుటనిరసన వ్యక్తం చేయాలని సవాలు చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు, రైతులరుణాల మాఫీ చెసిన తరువాతనే టీడీపీ ఎన్నికలకు వెళ్లాలని రోజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment