స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తానే ఇన్‌చార్జ్ ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురం అర్బన్ : స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తానే ఇన్‌చార్జ్ ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ బిబ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిల్‌ప్రతిపక్షనాయకుడు శివా మాట్లాడారు. ఎమ్మెల్యేకి సహాయకుడిగా విధులు నిర్వర్తిం చాల్సిన పీఏ ఎమ్మెల్యే స్థాయిలో ప్రభుత్వ వ్యవహారిక ఉత్తరాలపై సంతకాలు (ఎండార్స్‌మెంట్) చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.
ఎలాంటి హోదాలేకపోయినా అధికార, అనధికార కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పాల్గొనడం, ప్రభుత్వ ఉత్తరాలపై సిఫార్సు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఈయన వ్యవహారాలను అడ్డుకోవాల్సిన అధికారులు తలలు ఊపుతో పనిచేయడం శోచనీయమన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన ఇన్‌చార్జి ఎమ్మెల్యేగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇన్‌చార్జి ఎమ్మెల్యే అన్నది రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.
పోలీసుల సాయంతో వైఎస్సార్‌సీపీని అణచివేస్తామని డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం వారి అధికార దాహానికి నిదర్శనమన్నారు. కౌన్సిలర్లు అసీఫుల్లా, రజనీ, మహిళా నాయకులు నాగమణి మాట్లాడుతూ తెలియని పరిస్థితిలో కొందరు యువకులు ఎమ్మెల్యే ఇంటివద్దకు వెళ్లగా ఎమ్మెల్యే పీఏ వారిని అరెస్టు చేయించడం అన్యాయమన్నారు. పీఏ తన ప్రాబల్యం పెంచుకోవడానికి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యలు చెప్పుకోడానికి గ్రామీణులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి క ల్పిస్తున్నారని వారు ఆరోపించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిలర్లు అంజినప్ప, షాజియా, నాయకులు రియాజ్,బాలాజి,సమద్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.