సాక్షి ప్రతినిధి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు గెలుపే ధ్యేయంగా మేనిఫెస్టోలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, వాటన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం గుంటూరు వచ్చిన ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. రైతులు, డ్వాక్రా గ్రూపుల రుణాల మాఫీలో బాబు వంచనను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపైనా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టనున్నామని తెలిపారు.
రైతు పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని హామీలు అమలు చేసేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల్లోని అర్హులకు కూడా పింఛన్లు రద్దు చేశారని, వీటి పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఏవిధమైన దాడులు జరగకుండా చూస్తున్నామనీ, ఎక్కడైనా దాడి జరిగితే పార్టీకి చెందిన సీనియర్లు అంతా అక్కడకు వెళ్లి కార్యకర్తలకు భరోసా, ధైర్యాన్ని కలిగిస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సరస్వతికి భూముల లీజు రద్దుపై
న్యాయపోరాటం:సరస్వతి సిమెంట్స్ లీజు రద్దుపై న్యాయపోరాటం చేస్తామని వైవీ తెలిపారు. కేవలం రాజకీయ వేధింపు, కక్షతోనే టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులను చేసేందుకు దాడులు, హత్యలకు టీడీపీ తెగబడిందని, ఇప్పుడు పరిశ్రమల స్థాపనకు అడ్డుపడుతోందని విమర్శించారు. పరిశ్రమ స్థాపనకు రైతులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ఏ చట్టం చెబుతోందని ఆయన ప్రశ్నించారు. కంపెనీ స్థాపనకు ఇవ్వాల్సిన అన్ని అనుమతులను ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం తొక్కి పెట్టిందని ఆరోపించారు. నీటి కేటాయింపుల కోసం 2009లోనే సంస్థ దరఖాస్తు చేసుకున్నా ఇంత వరకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
హామీల అమలు కోసం వైఎస్సార్‌సీపీ ధర్నాలు
Published Sun, Oct 12 2014 3:09 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement