‘మామీద ఎందుకంత కక్ష, మేమేం తప్పు చేశాం’
కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధంతో పాటు కాపు నేతల అరెస్ట్‌లపై వైఎస్‌ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ కాపులను అణచివేస్తున్న చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీని అమలు చేయాలని కోరడమే కాపులు చేసిన తప్పా? అని కన్నబాబు ప్రశ్నించారు. కాపులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు భవిష్యత్‌లో ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు.
గుంటూరులో వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.... ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా?. కాపులను ఎంతకాలం అణచివేస్తారు. వ్యక్తిగత పనికోసం వెళ్తుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మా మీద ఎందుకింత కక్ష సాధింపు, మేమేం తప్పు చేశాం. ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలి కానీ ఉద్యమాన్ని అణివేయాలనుకోవడం సరికాదు.’ అని అన్నారు.
కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. మూడేళ్లయినా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. హామీని అమలు చేయమని కోరడమే నేరమా, కాపులను అవమానిస్తే ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.